23 ఏళ్ల క్రితం ఐటీ అధికారి అవినీతి.. 15 వేల లంచానికి రూ. 1.5 లక్షల జరిమానా, ఆరేళ్ల జైలు శిక్ష

By Mahesh KFirst Published Sep 12, 2022, 11:57 PM IST
Highlights

ఆయన ఉన్నత ఉద్యోగి. కానీ, ఒక ఎన్‌వోసీ జారీ కోసం రూ. 20 వేల లంచం అడిగాడు. ఈ విషయంపై సదరు వ్యక్తి సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాతి రోజే ఐఆర్ఎస్‌ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 23 ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసులో తీర్పు వచ్చింది. రూ. 1.5 లక్షల జరిమానా చెల్లించడంతోపాటు ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: అడ్డదారిలో వెళ్లిన ప్రయాణం ఎప్పటికో ఒకసారి బయటపడక మానదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఆ ఐఆర్ఎస్ అధికారి తాను తీసుకుంటున్న లంచం చాలా తక్కువ అనుకున్నాడేమిటో గానీ. అవినీతి అవినీతే. ఆ అవినీతే పాపంలా చుట్టుకుని 23 ఏళ్ల క్రితం లంచం రూ. 15 వేలు తీసుకుంటే.. శిక్షలో భాగంగా తాను ఇప్పుడు రూ. 1.5 లక్షల జరిమానాను ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాదు, ఆరేళ్ల జైలు శిక్ష కూడా పడింది.

1989 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ మిశ్రాకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ట్రయల్ కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. 23 ఏళ్ల క్రితం ఆయన రూ. 15 వేలు లంచం తీసుకున్నట్టు నిరూపణ కావడంతో ఈ శిక్ష విధించింది. అంతేకాదు, రూ. 1.5 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది.

1999లో అరవింద్ మిశ్రా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఓ వ్యక్తి అరవింద్ మిశ్రాపై ఫిర్యాదు చేశాడు. తనకు నిర్దేశిత ఫార్మాట్ 24 (ఏ) ప్రకారం నో డ్యూస్ సర్టిఫికేట్ జారీ చేయాలని అడిగినందుకు తన నుంచి రూ. 20 వేల లంచాన్ని అరవింద్ మిశ్రా అడిగారని ఆయన ఆరోపించాడు. సీబీఐ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

తర్వాతి రోజే అరవింద్ మిశ్రాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఒక ట్రాప్ వేసింది. ఆయన రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఉండగా సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ప్రత్యేక న్యాయస్థానంలో ఆయనపై సీబీఐ చార్జిషీట్ ఫైల్ చేసింది. 

హైకోర్టు ముందు రకరకాల పిటిషన్లు పెండింగ్ ఉండటం మూలంగా ఈ కేసు విచారణలో చాలా సార్లు స్టే వచ్చిందని, అందుకే తీర్పు వచ్చేసరికి చాలా ఆలస్యం జరిగిందని సీబీఐ ప్రతినిధి ఆర్ సీ జోషి వివరించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులో సీబీఐ తన వాదనలతో న్యాయమూర్తులను మెప్పించింది. ఆయనకు శిక్ష పడేలా వాదించింది. సీబీఐ అందించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని అరవింద్ మిశ్రాను ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. లంచం తీసుకున్నాడని నిరూపణ అయినట్టు సోమవారం కోర్టు స్పష్టం చేసింది.

click me!