ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండుగను ఆర్మీతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబాలకు దూరంగా దీపావళి వేడుకను సరిహద్దులో జరుపుకోవడంపై ఆర్మీని అభినందించారు. ఇది బాధ్యత పట్ల వారికి ఉన్న సంకల్పాన్ని వెల్లడిస్తున్నది ప్రధాని మోడీ తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం సైన్యంతో జరుపుకుంటున్నారు. దీపావళి సంబురాలు ఆర్మీతోనే జరుపుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో లెప్చాలో సోల్జర్లతో గడిపారు. ఈ సందర్భంలో ప్రధాని మాట్లాడుతూ.. సైనికులు మన దేశ సరిహద్దులో హిమాలయాల వలే సుదృఢంగా నిలబడినంత కాలం మన దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు.
సరిహద్దులను సంరక్షించడంలో భారత సైన్యానిది కీలక పాత్ర అని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచంలో అనేక చోట్ల సంఘర్షణలు జరుగుతున్న తరుణంలో మన సైనికులు దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంపై ప్రపంచంలో అంచనాలు పెరుగుతున్నాయని, ఈ సందర్భంలో దేశ సరిహద్దులు సురక్షితంగా ఉండటం ఆవశ్యకం అని అన్నారు. మన దేశంలో శాంతియుత వాతావరణాన్ని నిర్మిస్తున్నామని, ఇందులో సైన్యానిది ముఖ్యపాత్ర అని వివరించారు. దేశ నిర్మాణంలో భారత ఆర్మీ నిరంతరాయంగా భాగస్వామ్యం అవుతున్నదని తెలిపారు.
undefined
దీపావళిని ఆర్మీ జవాన్లతో వేడుక చేసుకోవడంపై ప్రధాని మోడీ మాట్లాడారు. తాను గత 30 నుంచి 35 ఏళ్లుగా ఇలాగే సైనికులతో దీపావళి పండుగ జరుపుకుంటున్నానని చెప్పారు. ప్రధానమంత్రి కాకముందే, గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా చేపట్టకముందే ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాని వివరించారు.
దీపావళి రోజున సైనికులు కుటుంబాలకు దూరంగా ఉండటంపై ప్రధాని అభినందించారు. కుటుంబం ఎక్కడ ఉంటే అక్కడే పండుగ జరుపుకుంటారని, కానీ, జవాన్లు కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో ఉంటున్నారని వివరించారు. దేశ సంరక్షణ బాధ్యతపై వారికి ఉన్న సంకల్పాన్ని ఇది వెల్లడిస్తున్నదని తెలిపారు. తన వరకైతే సైనికులు, భద్రతా బలగాలు ఎక్కడ ఉంటే అదే తనకు దేవాలయం వంటిదని వివరించారు.