
Indian Army : భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది. ఉక్రెయిన్ తో రష్యా యుద్దాన్ని ప్రపంచ దేశాలన్ని వ్యతిరేకిస్తుంటే భారత్ మాత్రం ఆ దేశంతో వ్యాపారంచేస్తూ ఆర్థిక వనరులు సమకూరుస్తోందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందువల్లే భారత్ పై 25 శాతం టారీఫ్స్ విధించినట్లు... అలాగే మరిన్ని ఫెనాల్టీలు కూడా ఉంటాయని హెచ్చరించింది.
ఇలా ప్రపంచ దేశాల ముందు భారత్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది అమెరికా. ఇదే సమయంలో పాకిస్థాన్ పై కేవలం 19శాతం సుంకాలను విధించింది ట్రంప్ సర్కార్. అలాగే ఆ దేశానికి సహాయసహకారాలు అందిస్తామని ట్రంప్ ప్రకటించాడు. ఇలా భారత్ ను శత్రువులా చూస్తున్న ట్రంప్ పాక్ ను దగ్గరకు తీస్తున్నాడు.
అయితే ట్రంప్ చర్యలతో భారత్ ఏమాత్రం భయపడటంలేదు... ట్రంప్ కోసం తమ విధానాలను మార్చుకోబోమని స్పష్టం చేస్తోంది. అంతేకాదు యుద్ద సమయంలో రష్యాకు భారత్ సహాయం చేస్తోందన్న అమెరికా ఆరోపణలకు ఘాటుగా సమధానమిస్తోంది. గతంలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ద సమయంలో అమెరికా ఎలా వ్యవహరించిందో ఇండియన్ ఆర్మీ సాక్షాలతో సహా బైటపెట్టింది. అమెరికా పాకిస్థాన్ కు ఎలా సాయం చేసిందో ఆనాడు ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేసింది భారత ఆర్మీ.
1971 లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత్ మద్దతుగా నిలిచింది... ఇది భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దానికి దారితీసింది. ఈ సమయంలోనే భారత రక్షణ మంత్రి విసి శుక్లా పాకిస్థాన్ కు ఎక్కడినుండి ఆయుధాలు లభిస్తున్నాయో పార్లమెంట్ లో వివరించారు. 1954 నుండి పాకిస్థాన్ కు అమెరికా దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువై ఆయుధాలను అందజేసిందని శుక్లా తెలిపారు. అమెరికా, చైనా దేశాలు అందించిన ఆయుధాలనే పాకిస్థాన్ భారత్, బంగ్లాదేశ్ లపై దాడులకు ఉపయోగిస్తోందని మాజీ రక్షణమంత్రి శుక్లా మాట్లాడినట్లుగా ఉన్న పేపర్ కటింగ్ ను ఇండియన్ ఆర్మీ (ఈస్టర్న్ కమాండ్) ఎక్స్ లో పోస్ట్ చేసింది.