మాట తప్పిన తాలిబాన్.. మన పౌరుల తరలింపునకే ప్రాధాన్యత: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్

By telugu teamFirst Published Aug 26, 2021, 2:17 PM IST
Highlights

ఖతర్ రాజధాని దోహాలో జరిగిన శాంతి చర్చల్లో తాలబాన్లు ఇచ్చిన మాటను తప్పారని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులేమీ బాగాలేవని పార్లమెంటులో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు. అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని చెప్పారు.

న్యూఢిల్లీ: దోహాలో జరిగిన శాంతి చర్చల్లో ఇచ్చిన మాటకు తాలిబాన్లు కట్టుబడి లేరని, వారు మాట తప్పారని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులేమీ బాగాలేవని వివరించింది. అందుకే అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలకు ఆయన ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితులను వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు రావడానికి సుమారు 15వేల మంది భారత ప్రభుత్వ సహాయం కోరినట్టు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయులను తరలించడమే ప్రధానంగా తీసుకున్నట్టు వివరించారు.

కాబూల్‌కు భారత్ నుంచి రోజుకు కేవలం రెండే విమానాలకు అనుమతి ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన పౌరులను తరలింపునకు కేంద్రం శాయశక్తుల ప్రయత్నిస్తున్నది. ఇప్పటి వరకు సుమారు 300 మంది భారతీయులను కేంద్రం తరలించినట్టు తెలుస్తున్నది. ఇదే సంఖ్యలో విదేశీయులనూ తరలించిందని సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో తరలింపు ప్రక్రియ నెమ్మదించింది. వీటికి తోడు ఆఫ్ఘనిస్తాన్‌లోని చాలా మంది భారతీయులు ఎంబసీని ఆశ్రయించడం లేదని తెలిసింది. దీంతో వారిని గుర్తించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. 

ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై అఖిల పక్ష సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు వివరించాలని కేంద్ర విదేశాంగ శాఖను సూచించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా గురువారం పార్లమెంటు కాంప్లెక్స్‌లో అఖిల పక్ష సమావేశం జరిగింది. 

ఈ భేటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పియూశ్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, వీ మురళీధరన్, మీనాక్షి లేఖీలతోపాటు కాంగ్రెస్ నేతలు.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధరి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే నేత టీఆర్ బాలు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడలు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

దోహాలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒప్పందం తర్వాతి 135 రోజుల్లో అమెరికా తన బలగాలను 8,600కు తగ్గించాలి. బందీలను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందమూ ఉన్నది. 5000 మంది తాలిబాన్లు, 1000 మంది ఆఫ్గనిస్తాన్ సెక్యూరిటీ బందీలను ఇచ్చిపుచ్చుకోవాలి. తాలిబాన్లు తమ అధీనంలోని భూభాగాల్లో అల్ ఖైదా సహా ఇతర తీవ్రవాద గ్రూపులను అనుమతించవద్దు. వీటితోపాటు మరికొన్ని ఒప్పందాలున్నాయి.

click me!