
Agni-5 Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. భారత్ తన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఆగస్టు 20న ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో అగ్ని-5 మిసైల్ నిర్దేశించిన అన్ని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భవిష్యత్తులో ఈ మిసైల్ వ్యవస్థల సిస్టమ్‌ల సిద్ధతను పరీక్షించడానికి ఇది సాధారణ పరీక్ష మాత్రమే.
అగ్ని-5 మిసైల్ భూ ఆధారిత, మధ్యతరహా బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి సుమారు 5,000 కిలోమీటర్లు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ఈ మిసైల్ భవిష్యత్తులో 7,500 కిలోమీటర్ల రేంజ్ కలిగిన కొత్త వేరియంట్‌గా మరింత శక్తివంతంగా తయారవుతోంది. అగ్ని-5 MIRV (Multiple Independent Re-entry Vehicle) టెక్నాలజీతో రూపొందించబడింది, అంటే ఒకే ఒక్క మిసైల్ సాయంతో అనేక లక్ష్యాలను వేర్వేరు దిశల్లో ధ్వంసం చేయవచ్చు. DRDO బంకర్-బస్టర్ సామర్థ్యాన్ని జోడించి, శత్రువుల కీలకమైన బేస్‌లను కూడా లక్ష్యంగా చేసేందుకు పరిశీలిస్తోంది.
భారత్ గతేడాది మార్చి 11న ‘మిషన్ దివ్యాస్త్ర’ ప్రాజెక్ట్‌లో అగ్ని-5 MIRV మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించి, బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించిందని DRDO తెలిపారు. ఈ మిసైల్ పరీక్షలు భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. తాజా పరీక్ష విజయవంతం కావడంతో పాకిస్తాన్‌లో కలవరమనే చెప్పాలి.
భారత్ అగ్ని-5 మిసైల్: తెలుసుకోవలసిన ముఖ్యాంశాలు
అణు సామర్థ్యం: అగ్ని-5 భూ-ఆధారిత ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ (ICBM), ఒకే సారి పలు పాంత్రాలను లక్ష్యంగా చేసుకోగల MIRV టెక్నాలజీతో రూపొందించబడింది. దీనిని DRDO అభివృద్ధి చేసింది.
పరిధి: ప్రస్తుత అగ్ని-5 5,000 కిమీ వరకు లక్ష్యాలను ఛేదించగలదు. DRDO 7,500 కిమీకి చేరుకునే అప్‌గ్రేడ్ వేరియంట్‌పై పనిచేస్తోంది.
సామర్థ్యం : 2024 మార్చి 11న తమిళనాడులోని కల్పక్కం నుండి MIRVed పరీక్ష నిర్వహించి, పలు వార్‌హెడ్‌లను సాఫీగా మోసుకెళ్లే సామర్థ్యాన్ని ధృవీకరించింది. ఒకేసారి మూడు అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.
పాకిస్తాన్ ఆందోళన
ఈ పరీక్ష పాకిస్తాన్‌లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. SVI (స్ట్రాటజిక్ విజన్ ఇన్‌స్టిట్యూట్) భారతదేశ క్షిపణి కార్యక్రమం ప్రాంతీయ స్థిరత్వానికి ప్రమాదకరమని హెచ్చరించింది. 2016లో MTCRలో చేరిన తరువాత భారత్ అధునాతన క్షిపణి వ్యవస్థలను పొందుతూ, అభివృద్ధిని వేగవంతం చేసింది. భవిష్యత్తులో 8,000 కిమీ రేంజ్ వేరియంట్ల ద్వారా వాషింగ్టన్, మాస్కో, బీజింగ్ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉన్నట్లు సూచించారు. మొత్తానికి అగ్ని-5 పరీక్ష భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతుంది.