russia ukraine crisis: రష్యాపై అమెరికా ఆంక్షలు.. భారత్‌కూ ముప్పు తప్పదా..?

Siva Kodati |  
Published : Feb 25, 2022, 02:49 PM IST
russia ukraine crisis: రష్యాపై అమెరికా ఆంక్షలు.. భారత్‌కూ ముప్పు తప్పదా..?

సారాంశం

రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా సారథ్యంలోని అగ్ర రాజ్యాలు ఆంక్షల మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు భారత్‌ను ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. అమెరికాతో ఆయుధ, రక్షణ ఒప్పందాలు భారత్ కు ఉన్నా.. రష్యాతో ఆయుధ వ్యాపారమే ఎక్కువ. ఇప్పటి వరకు ఈ విషయంలో అమెరికా భారత్‌ను హెచ్చరించడం వరకే పరిమితమైంది. అంతేకానీ, ఆర్థిక ఆంక్షల జోలికి పోలేదు. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడం ఇండియాకు ఇబ్బందుల్లోకి నెట్టింది

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం (russia ukraine crisis) భారతదేశాన్ని చిక్కుల్లో పడేసింది. ఇరు దేశాలతో బలమైన సంబంధాలు వుండటంతో భారత్ ఎటూ తేల్చుకోలేని పరిస్ధితి. దీంతో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అనుసరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు (vladimir putin) ఫోన్ చేసిన ప్రధాని (narendra modi) యుద్ధాన్ని ఆపాలని సూచించారు. అయితే రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా సారథ్యంలోని అగ్ర రాజ్యాలు ఆంక్షల మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు భారత్‌ను ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. 

భారత్ కు చిరకాల మిత్ర దేశం రష్యా. అత్యాధునిక ఆయుధ సంపత్తిని భారత్ కు అందించడం ద్వారా కీలక వాణిజ్య భాగస్వామిగా ఉంటోంది. దశాబ్దాలుగా ఇరు దేశాల మైత్రిబంధం బలంగానే కొనసాగుతోంది. కానీ, ఇది అమెరికాకు గిట్టడం లేదు. భారత్ ఏం కొన్నా అది అమెరికాతోనే చేయాలన్నది అగ్రరాజ్యం వైఖరి. అమెరికాతో ఆయుధ, రక్షణ ఒప్పందాలు భారత్ కు ఉన్నా.. రష్యాతో ఆయుధ వ్యాపారమే ఎక్కువ. ఇప్పటి వరకు ఈ విషయంలో అమెరికా భారత్‌ను హెచ్చరించడం వరకే పరిమితమైంది. అంతేకానీ, ఆర్థిక ఆంక్షల జోలికి పోలేదు. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడం ఇండియాకు ఇబ్బందుల్లోకి నెట్టింది. అమెరికా, ఐరోపా సమాజం రష్యా చర్యను తీవ్రంగా ఖండిస్తూ.. కఠిన ఆంక్షలను ప్రకటించాయి. దీంతో రష్యా నుంచి భారత్ రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే అమెరికా ఆంక్షలకు దిగొచ్చని రక్షణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కౌంటరింగ్ అమెరికా అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (క్యాట్సా) అనే చట్టం ఒకటి ఉంది. ఇది రష్యా నుంచి ఇతర దేశాలు ఆయుధాలు కొనకుండా నిరోధిస్తోంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ సర్కారు, బైడెన్ సర్కారుతో భారత్ మెరుగైన సంబంధాల వల్ల ఈ చట్టం కింద ఆంక్షలను తప్పించుకుంది. దీంతో క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400ను రష్యా నుంచి దిగుమతి చేసుకున్నా, అమెరికా హెచ్చరించిందే తప్పించి ఆంక్షల జోలికి పోలేదు. మొదటి ఐదు ఎస్-400 వ్యవస్థలు కొన్ని నెలల క్రితమే భారత్ కు అందాయి. ఇందుకోసం భారత్ రూ.40,000 కోట్లతో రష్యాతో 2018 అక్టోబర్ లో ఒప్పందం చేసుకుంది. పొరుగుదేశాలైన చైనా (china ) , పాకిస్థాన్ (pakistan) నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో మోదీ సర్కారు ఈ ఒప్పందానికి మొగ్గు చూపడం గమనార్హం.

అలాగే 3 బిలియన్ డాలర్లతో అకులా-1 క్లాస్ సబ్ మెరైన్ కొనుగోలుకు భారత్ 3 బిలియన్ డాలర్లతో 2019 మార్చిలో రష్యాతో ఒక ఒప్పందం చేసుకుంది. రష్యా అతిపెద్ద రక్షణ సరఫరాదారుగా ఉండగా.. ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికాతోనూ రక్షణ ఉత్పత్తుల ఒప్పందాలు భారత్ కు ఉన్నాయి. మరోపక్క, ఎస్-400 (s 400 missile system) కొనుగోలు చేయవద్దంటూ అమెరికా ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినా మోదీ సర్కారు పట్టించుకోవడం లేదు. భారత్ తో తనకున్న వాణిజ్య అవసరాల కోణంలో అమెరికా కూడా చూసీ చూడనట్టు వ్యవహరించింది. కానీ, ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యాను అన్ని వైపుల నుంచి దిగ్బంధించాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే రష్యాతో ఆయుధ వ్యాపారం విషయంలో భారత్ ఆటంకాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ