అగ్రరాజ్యాలు సైతం చేతులెత్తేసిన చోట... శెభాష్ ఇండియా

By Siva KodatiFirst Published Jan 17, 2021, 10:03 PM IST
Highlights

మనకన్నా సంపన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్ పంపిణీ చేయలేక చతికిలపడ్డాయి. కానీ భారతదేశం మాత్రం ఈ విషయంలో శెభాష్ అనిపించుకుంది. 

కోవిడ్ నివారణ కోసం దేశీయంగా తయారు చేసిన రెండు టీకాలకు భారత ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీరమ్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌లను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు.

మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిన్న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. అయితే మనకన్నా సంపన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్ పంపిణీ చేయలేక చతికిలపడ్డాయి. కానీ భారతదేశం మాత్రం ఈ విషయంలో శెభాష్ అనిపించుకుంది. 

వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా మనదేశం రికార్డు స్థాయిలో టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. టీకా పంపిణీ ప్రారంభమైన తొలిరోజే దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని తెలిపింది.

ఇది అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒకే రోజు వేసిన సంఖ్య కంటే ఎక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని వెల్లడించారు. రెండో రోజు 17 వేల మందికి వ్యాక్సిన్‌ అందించామని దీనితో కలిపి 2,24,301 మందికి వ్యాక్సిన్‌ వేశామని మనోహర్ పేర్కొన్నారు.

టీకా తీసుకున్న వారిలో 447 మందిలో రియాక్షన్ వచ్చిందని.. అది కూడా సాధారణమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటివి మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వీరిలో ముగ్గురిని మాత్రం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని వెల్లడించింది.

మరోవైపు వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్యాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోందని మనోహర్ చెప్పారు. ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 553 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగినట్లు ఆయన వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నాడు టీకా పంపిణీ కొనసాగిందని తెలిపారు. 

click me!