
భారత్‌లో మరోసారి కరోనా మహమ్మారి కలవరం సృష్టిస్తుంది. గత కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మరోసారి పెరుగుతున్నాయి. తాజాగా రోజువారి కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,813 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. అయితే కిందటి రోజు నమోదైన 1,150 కరోనా కేసులతో పోల్చితే.. కరోనా కేసుల్లో 89.8 శాతం పెరుగుదల ఉంది. మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవ్వడంతో జనాల్లో ఆందోళన చెందుతున్నారు. ఫోర్త్ వేవ్ మొదలు కానుందా..? అనే టెన్షన్ నెలకొంది.
మరోవైపు రోజువారి మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. తాజాగా 214 మంది కరోనా మృతిచెందారు. అయితే ఇందులో కేరళ నుంచే 213 ఉన్నాయి. వీటిలో 62 బ్యాక్‌లాగ్ మరణాల సంఖ్య ఉన్నప్పటికీ.. కిందటి రోజుతో పోలిస్తే మరణాల సంఖ్య భారీగానే పెరిగింది. మరోవైపు కరోనా రోజువారి పాజిటివ్ రేటు కూడా భారీగా పెరిగింది. నిన్న 0.31 శాతంగా ఉన్న కరోనా రోజువారి పాజిటివ్ రేటు.. నేడు 0.83 శాతానికి పెరిగింది.
ఇక, తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,44,280కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య 5,21,965కి పెరిగింది. ఇక, ప్రస్తుతం దేశంలో 11,542 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుంది. 18 ఏళ్లు పైబడినవారు ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్టర్ డోస్ వేయించుకోవడానికి కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఇక, దేశంలో ఆదివారం 2,66,459 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,54,94,355కు చేరింది.