భారత్‌లో ఒమిక్రాన్‌తో తొలి మరణం.. భయపెడుతున్న కరోనా కేసుల పెరుగుదల.. కేంద్రం ఏం చెప్పిందంటే..

By Sumanth KanukulaFirst Published Jan 6, 2022, 9:52 AM IST
Highlights

ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant)  భారత్‌లో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ (Omicron) మరణం నమోదు అయింది. రాజస్తాన్‌లో (Rajasthan) ఓ వృద్దుడు ఒమిక్రాన్‌తో మరణించినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. 

ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant)  భారత్‌లో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ (Omicron) మరణం నమోదు అయింది. రాజస్తాన్‌లో (Rajasthan) ఓ వృద్దుడు ఒమిక్రాన్‌తో మరణించినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మరింత వేగంగా పెరుగుతాయని వెల్లడించాయి. బుధవారం విలేకరుల సమావేశంలో  ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ (Lav Agarwal) మాట్లాడుతూ.. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గత వారం మరణించిన 73 ఏళ్ల వృద్ధుడి నమూనాలలో ఓమిక్రాన్ వేరియంట్ ఉనికిని గుర్తించినట్టుగా చెప్పారు. ఓమిక్రాన్ సానుకూల ఫలితాలు వచ్చే సమయానికి ఆ వ్యక్తి అప్పటికే మరణించాడని తెలిపారు. అయితే ఆ వృద్దుడికి డయాబెటిస్ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టు చెప్పారు. అయితే ఈ మరణం సాంకేతికంగా ఓమిక్రాన్‌కు సంబంధించినదేనని లవ్ అగర్వాల్ వెల్లడించారు. 

‘కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన వ్యక్తి మరణిస్తే.. దానిని COVID-19 మరణంగా పరిగణించనున్నట్టుగా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా..ఒక వ్యక్తి ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలితే.. అది ఆలస్యంగా గుర్తించబడినప్పటికీ మేము దానిని ఓమిక్రాన్ పాజిటివ్ కేసుగా మాత్రమే పరిగణిస్తాం’ అని Lav Agarwal చెప్పారు.

ఆందోళనకరంగా ఆర్ నాట్ విలువ..
కోవిడ్ -19 వ్యాప్తిని సూచించే ఆర్ నాట్ విలువ ప్రస్తుతం భారత్‌లో చాలా ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ (VK Paul) తెలిపారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కంటే ఇప్పుడు ఆర్ నాట్ విలువ ఎక్కువ‌గా ఉందన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ గరిష్టంగా ఉన్న సమయంలో ఆర్ నాట్ విలువ 1.69 ఉండగా.. ఇప్పుడు కరోనా వైరస్ అంతకు మించి వేగంగా విస్తరిస్తోందని అన్నారు.  ప్రస్తుతం దేశంలో ఆర్ నాట్ విలువ 2.69గా ఉందని వెల్లడించారు. 

ఇక, రాజస్తాన్‌లో జ్వరంగా, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వృద్దుడు ఆస్పత్రికి వెళ్లగా డిసెంబర్ 15న పరీక్షలు నిర్వాహించారు. అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో శాంపిల్స్ సేకరించి.. ఒమిక్రాన్ నిర్దారణ పరీక్షల నిమిత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అయితే రెండు సార్లు జరిపిన పరీక్షల్లో అతనికి నెగిటివ్‌గా నిర్దారణ అయింది. డిసెంబర్ 25న జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితంలో ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హైపర్ థైరాయిడిజం వంటి దీర్ఘకాలిక వ్యాధులు, కరోనా అనంతర నిమోనియో వంటి సమస్యలతో ఆయన మరణించినట్టు రాజస్తాన్ వైద్య అధికారులు వెల్లడించారు. 
 

click me!