
భారత్‌కు చెందిన ఓ గుర్తు తెలియని సూపర్ సోనిక్ క్షిపణిగా ( missile) భావిస్తోన్న ఫ్లయింట్ అబ్జెక్ట్ తమ భూభాగంలో పడిందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ అనుమానాస్పద పరికరం పాకిస్తాన్‌లోని (pakistan) మియాన్ చన్నూ నగరంలో కుప్పకూలినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ గగనతల సరిహద్దును ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. భారత రాయబారికి అక్కడ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన భారత్ వైపు నుంచి ప్రయోగించిన ఓ వేగవంతమైన గుర్తు తెలియని ఫ్లయింగ్ అబ్జెక్ట్ .. పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకొచ్చింది.
ఆ ప్రయోగం పాక్‌లోని పౌరుల ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని భారత రాయబారికి (Indian envoy) పాకిస్తాన్ విదేశాంగ శాఖ (Pakistans Foreign Office) నోటీసుల్లో తెలిపింది. అంతేకాకుండా తమ గగనతలంలోకి వచ్చిన ఈ అనుమానాస్పద వస్తువు వల్ల ఇక్కడి దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం వల్లే జరిగే పరిణామాలను గుర్తుంచుకోవాలని.. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని భారత్‌కు సూచించింది.
అంతేకాకుండా ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి.. ఆ సమాచారం తమకు తెలియజేయాలని పాక్ విదేశాంగశాఖ .. భారత రాయబారికి స్పష్టం చేసింది. అయితే దీనికి భారత్ సైతం అదే స్థాయిలో స్పందించింది. మిస్సైల్ మిస్ ఫైర్ అయ్యిందని.. సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందని భారత్ పేర్కొంది. దర్యాప్తుకు ఆదేశించినట్లు రక్షణ శాఖ (Defence Ministry ) వెల్లడించింది.
2019 ఫిబ్రవరిలో పుల్వామాలో (pulwama attack) సీఆర్‌పీఎఫ్ జవాన్లపై (crpf) ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత యుద్ధ విమానాలు బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలను (2019 Balakot airstrikes) ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ప్రచారం జరిగింది. దీనికి ప్రతీకారంగా భారత్ భూభాగంలోకి ఎఫ్-16 యుద్ధ విమానాన్ని పాక్ పంపగా.. వాయుసేన అప్రమత్తమై దానిని కూల్చివేసింది. ఈ ఘటనలతో భారత్- పాక్‌ల మధ్య మరో యుద్ధం తప్పదన్నంత స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. అయితే, అంతర్జాతీయ జోక్యంతో పాటు పాకిస్థాన్ కాళ్లబేరానికి రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.