
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కీలకమైన పంజాబ్‌లో (punjab election results) జాతీయ పార్టీలు రెండింటికి చేదు ఫలితాలే వచ్చాయి. కాంగ్రెస్ (congress) అధికారాన్ని కోల్పోగా... బీజేపీ (bjp) కనీసం ప్రభావం చూపించలేకపోయింది. ఇక్కడ ప్రధాన పార్టీలకు షాకిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) అధికారాన్ని అందుకుంది. దీంతో కీలక నేతలంతా ఓటమి పాలయ్యారు. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ (charanjit singh channi), పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ (navjot singh sidhu) , మాజీ సీఎం అమరీందర్ సింగ్‌లు (amarinder singh) పరాజయాన్ని చవి చూశారు.
ఈ నేపథ్యంలో సిద్ధూ స్పందిస్తూ.. పంజాబ్ ప్రజలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ప్రజలు రాజకీయ పరమైన మార్పును కోరుకున్నారని, కొత్త పార్టీకి స్వాగతం పలికారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోరని సిద్ధూ అన్నారు. ప్రజా వాక్కు దైవ వాక్కుతో సమానం అని ... ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని సిద్ధూ స్పష్టం చేశారు. ఈ ఫలితాలతో తానేమీ కుంగిపోవడం లేదని, పంజాబ్ అభ్యున్నతే తన లక్ష్యమని, అందులో ఎలాంటి మార్పులేదని ఆయన తేల్చిచెప్పారు. ఓ సన్యాసిలా రాగబంధాలకు అతీతంగా, ఎలాంటి భయాలు లేకుండా పాటుపడతానని తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పంజాబ్ పై తన ప్రేమ కొనసాగుతుందన్నారు.
తనను కిందికి తోయాలని చూసిన కొందరు.. ప్రజల చేతిలో ఓటమి పాలయ్యారంటూ సిద్ధూ విమర్శలు చేశారు. నేను ముఖ్యమంత్రి అభ్యర్థి కానందున పంజాబ్ అంతటా ప్రచారం చేసే అధికారం తనకు లేదని... ఇది చన్నీ బాధ్యత అని నవజోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. చన్నీని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడే.. ప్రచారం మొత్తం ఆయన బాధ్యతే అని తాను చెప్పేశానంటూ ఓటమికి బాధ్యత తీసుకునే అంశంలో వెనకడుగు వేశారు. అయితే చన్నీని ప్రజలు అంగీకరించారా..? లేదా..? అనే విషయంపై తాను స్పందించనంటూ సిద్ధూ వ్యాఖ్యలు చేశారు.
కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ కూడా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిద్ధూ 6 వేల ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో పరాజయం పాలయ్యారు. గతంలో అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సిద్ధూ మూడుసార్లు గెలిచారు. 2017లో కాంగ్రెస్ తరఫున పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.