ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు: కేరళలో రెండు రోజుల లాక్‌డౌన్

By narsimha lodeFirst Published Jul 14, 2021, 10:51 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసుల నమోదు హెచ్చు తగ్గులు చోటు చేసుకొంటున్నాయి. మొన్నటితో పోలిస్తే నిన్న  కరోనా కేసుల నమోదులో 23 శాతం పెరుగుదల కన్పించింది. కేరళలో కరోనా కేసుల కట్టడికి విజయన్ సర్కార్ రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. 

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తోంది. మొన్నటితో పోలిస్తే నిన్న కరోనా కేసులు 23 శాతం పెరిగాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 38,792గా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 19,15,501 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో  38,792 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కరోనా కేసులు 3.09 కోట్లకు చేరాయి. కరోనాతో నిన్న ఒక్క రోజే 624 మంది మరణించారు.దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,11,408కి చేరింది.

దేశంలో ఇంకా 4,29,946 కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. యాక్టివ్ కేసులు 1.39 శాతానికి తగ్గింది.  నిన్న ఒక్క రోజే  41 వేల మంది కరోనా నుండి కోలుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు 3,01,04,720 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  కరోనా రోగుల రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకొంది.

దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు గాను  వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని  కేంద్రం భావిస్తోంది.ఈ విషయమై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలను  విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు 38.76 కోట్లమంది టీకా వేయించుకొన్నారు. నిన్న ఒక్క రోజే 37.14 లక్షల మంది టీకా వేయించుకొన్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఇదిలా ఉంటే కేరళలో కరోనాను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్రం మరో సారి లాక్ డౌన్ విధించింది. ఈ నెల 17,18 తేదీల్లో లాక్ డౌన్ కొనసాగించాలని కేరళ సర్కార్ నిర్ణయం తీసుకొంది. 

click me!