మలేషియాకు 18 యుద్ధ విమానాలు అమ్మడానికి సిద్ధం: పార్లమెంటులో కేంద్రం

By Mahesh KFirst Published Aug 5, 2022, 5:34 PM IST
Highlights

మలేషియాకు 18 యుద్ధ విమానాలు ఆఫర్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంటులో వెల్లడించింది. 18 యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తామన్న మలేషియా ప్రతిపాదనకు కేంద్రం స్పందించినట్టు వివరించింది. ఈ సింగిల్ ఇంజిన్ తేజస్ విమానాలు కొనగోలు చేయడానికి అర్జెంటినా, ఆస్ట్రేలియా, ఈజిప్టు, యూఎస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ కూడా సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలిపింది.

న్యూఢిల్లీ: మలేషియా దేశానికి 18 తేజస్ విమానాలను అమ్మడానికి ఆలోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. 18 లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ విమానాలను మలేషియాకు అమ్మడానికి ఆఫర్ చేసినట్టు కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించింది. ఈ సింగిల్ ఇంజిన్ తేజస్ విమానాలను కొనడానికి అర్జెంటినా, ఆస్ట్రేలియా, ఈజిప్టు, యూఎస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పేర్కొంది. 

కేంద్ర ప్రభుత్వం గతేడాది 6 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను ప్రభుత్వ రక్షణ సంస్థ హిందుస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్‌కు ఇచ్చింది. 83 దేశీయ విమానాలు తేజస్ జెట్‌లను తయారు చేసి 2023 కల్లా డెలివరీ చేయడమే ఆ ప్రాజెక్ట్. 1983లో ఈ ప్రాజెక్ట్‌కు తొలి ఆమోదం లభించింది.

రక్షణ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే వీలైనంత వరకు దేశీయంగా తయారు చేసుకోవడమే కాదు.. దౌత్య మార్గాల్లో వాటిని ఎగుమతి చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నది. 

తేజస్ విమానాలు చాలా కాలం అనేక సవాలళ్లు, దాని డిజైన్‌ లోపాలను ఎదుర్కొన్నాయి. ఈ విమానాలు చాలా బరువు ఉన్నాయని ఒకసారి ఇండియన్ నేవీ వీటిని తిరస్కరించాయి కూడా.

18 ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయాలని భావిస్తున్నామని రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ప్రతిపాదన వచ్చిందని, ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం స్పందించినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పార్లమెంటుకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఎల్‌సీఏ ఎయిర్ క్రాఫ్ట్ కోసం అర్జెంటినా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, యూఎస్ఏ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ కూడా ఆసక్తి చూపినట్టు వివరించారు.

ఒక స్టెల్త్ ఫైటర్ జెట్‌నూ తయారు చేయడానికి పని చేస్తున్నామని తెలిపారు. కానీ, దేశ భద్రత కారణంగా ఆ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.

భారత్ స్వయంగా ఫైటర్ జెట్లు తయారు చేసుకోవాలనే లక్ష్యానికి తాము మద్దతు ఇస్తున్నట్టు ఏప్రిల్‌లో బ్రిటన్ తెలిపింది. ప్రస్తుతం భారత్ దగ్గర రష్యా, బ్రిటన్, ఫ్రెంచ్ ఫైటర్ జెట్లే ఉన్నాయి.

click me!