ఫైజర్, మొడెర్నా టీకాలు అక్కర్లేదు.. దేశీయ టీకాలు చాలు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం!

By telugu teamFirst Published Sep 21, 2021, 7:44 PM IST
Highlights

అమెరికా కంపెనీలు అభివృద్ధి చేసిన ఫైజర్, మొడెర్నా టీకాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని భావించడం లేదని, దేశీయ కంపెనీలే డిమాండ్‌కు సరిపడా టీకాలు ఉత్పత్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవి పెట్టే షరతులతోపాటు అత్యధిక ధర చెల్లించి వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు వివరించాయి.

న్యూఢిల్లీ: దేశంలో టీకా పంపిణీ వేగవంతమవుతున్నది. చాలా మంది టీకాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ రాష్ట్రాల నుంచి టీకా కొరత స్టేట్‌మెంట్లు రావడం లేదు. నిజానికి దేశంలో ప్రస్తుత డిమాండ్‌కు సరిపడా టీకాలను దేశీయ కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి. అంతేకాదు, మిగులు టీకాలను విదేశాలకు ‘వ్యాక్సిన్ మైత్రి’ కింద మళ్లీ పంపించడానికి కేంద్రం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలోనే అధిక ధర, సాధ్యపడని షరతులను అంగీకరించి విదేశీ టీకాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఫైజర్, మొడెర్నా టీకాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని భావించడం లేదని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.

ఫైజర్, మొడెర్నా టీకాల కొనుగోలును విరమించుకోవడానికి ప్రధాన కారణం దేశీయ టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ల ఉత్పత్తి ఆశించిన మేరకు పెరగడమేనని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అయితే, దేశీయంగా ఫిల్, ఫినిష్ చేసిన జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను కొనుగోలు చేసే అవకాశముందని వివరించాయి.

కరోనా మహమ్మారి దశలో ఉన్నప్పుడు తమ టీకాలను కేంద్ర ప్రభుత్వాలు విక్రయిస్తామని, అందులోనూ తమ టీకాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దానికి బాధ్యత తమది కాదని, అందుకు అంగీకరించాలనే డిమాండ్లను ఈ అమెరికా కంపెనీలు భారత ప్రభుత్వం ముందుంచాయి. వీటికితోడు ఈ టీకాల కోసం అధిక ధరలు చెల్లించాలి. మళ్లీ వాటిని స్టోర్ చేయాలంటే అతిశీతల గిడ్డంగులు అవసరం. అవి మనదేశంలో చాలా చోట్ల అందుబాటులో లేవు.

పెద్దమొత్తంలో ధర పెట్టి మళ్లీ వాటి షరతులను ఎందుకు అంగీకరించాలని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయదని, ఒకవేళ అవి మనదేశంలోని ప్రైవేటు కంపెనీలతో డీల్ చేసుకోవాలని భావిస్తే అందుకు రెగ్యులేటరీ క్లియరెన్స్ తీసుకుని ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని వివరించాయి.

click me!