
న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చే తీర్మానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రాజ్యాంగం ఇండియా, దట్ ఈజ్ భారత్ అని దేశాన్ని సంబోధిస్తున్నది. కానీ దీన్ని సింపుల్‌గా భారత్ అని మార్చాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చడానికి రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త తీర్మానాన్ని తీసుకురానున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవలే ఈ మార్పును స్వాగతిస్తూ.. ప్రజలూ భారత్ అనే వాడాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అసోంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ అనే పేరు శతాబ్దాల క్రితం నాటిదని, ఏ భాషలోనైనా భారత్ అనే వాడాలని సూచించారు. ప్రధాని కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. ఆగస్టు 15న ఎర్రకోటపై తన ప్రసంగంలో ఐదు ప్రతిజ్ఞలకు సూచనలు చేశారు. అందులో ఒకటి, భానిస అవశేషాల నుంచి సంపూర్ణ స్వాతంత్ర్యం. భారతీయ గుర్తింపును ఎత్తిపట్టాలనే ఉద్దేశం సంజ్ఞాత్మకంగా ఇందులో దాగి ఉన్నది.
ఇది వరకే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లడానికి వినియోగించే విమానాల్లో ఇండియాకు బదులు భారత్ అని మార్చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ రాజ్యాంగం నుంచి ఇండియాను తొలగించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు నరేశ్ బన్సాల్ డిమాండ్ చేశారు. తోటి బీజేపీ ఎంపీ హరనాత్ సింగ్ యాదవ్ కూడా ఆయన డిమాండ్‌ను సమర్థించారు.
ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రతిపాదనను తెచ్చే అవకాశం ఉన్నది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానంలో ‘భారత్’
జీ 20 ప్రతినిధులను డిన్నర్ కోసం ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఓ ఆహ్వానపత్రం బయటికి వచ్చింది. ఇందులో సాధారణంగా ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సింది. కానీ, తాజా ఆహ్వానంలో ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని వచ్చింది.
Also Read: Parliament: ప్రత్యేక సమావేశాల కోసం స్ట్రాటజీ గ్రూపుతో సోనియా గాంధీ కీలక భేటీ
కాంగ్రెస్ కామెంట్
దీన్ని వెంటనే కాంగ్రెస్ లీడర్ జైరాం రమేశ్ ఎక్స్‌లో లేవనెత్తారు. సెప్టెంబర్ 9వ తేదీన జీ 20 డిన్నర్ కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఇన్విటేషన్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా పేర్కొన్నారని, అంటే ఆ వార్తలే నిజమేనన్నట్టు అని పేర్కొన్నారు. అయితే.. ఇక పై రాజ్యాంగంలో ఇండియా దటీజ్ భారత్ అని కాకుండా.. భారత్ దట్ వజ్ ఇండియా, షల్ బీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చదువుకోవాల్సి ఉంటుందేమో అని వివరించారు. కానీ, ఈ రాష్ట్రాల సమాఖ్యపైనా దాడి జరుగుతున్నదని తెలిపారు.
మరో ట్వీట్‌లో మోడీ చరిత్రను వక్రీకరణ కొనసాగిస్తూనే ఇండియాను డివైడ్ చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. కానీ, తాము వెనక్కి తగ్గబోమని, ఇండియా పార్టీల లక్ష్యమేమిటీ? అది ‘భారత్’ కదా. (BHARAT అంటే B-bring harmony, A-Amity, R-Reconciliation, T-Trust) అని అర్థం రాసుకొచ్చారు.