Russia Ukraine War: ఆ నిర్ణయం భారత్‌ను తప్పుడు చరిత్రలో భాగం చేస్తుంది: అమెరికా

Published : Mar 16, 2022, 12:38 PM ISTUpdated : Mar 16, 2022, 12:41 PM IST
Russia Ukraine War: ఆ నిర్ణయం భారత్‌ను తప్పుడు చరిత్రలో భాగం చేస్తుంది: అమెరికా

సారాంశం

రష్యా ఆఫర్‌ను భారత్ స్వీకరిస్తే.. చరిత్రలో ఆ దేశం తప్పు వైపుగా నిలిచిపోతుందని అమెరికా పేర్కొంది. తక్కువ ధరలకు క్రూడ్ ఆయిల్ అమ్ముతామన్న రష్యా ఆఫర్‌ను భారత్ స్వీకరిస్తే.. అది తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్టు కాదని, కానీ, ఆ నిర్ణయం భారత్‌ను చరిత్రలో ఆక్రమణను సమర్థించే తప్పు వైపుగా నిలబెడుతుందని తెలిపింది.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యాపై అమెరికా, పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఆ దేశాల నుంచి ముడి చమురు, ఇతర సరుకుల దిగుమతులను నిలిపేశాయి. ఇతర దేశాలు ఈ ఆంక్షలకు తోడ్పడాలని సూచనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఆంక్షల ప్రభావం నుంచి బయటపడటానికి రష్యా మరో వ్యూహం వేసింది. తమ మిత్ర దేశాలకు ముడి చమురు, ఇతర సరుకులను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌కు కూడా భారీ డిస్కౌంట్లతో ముడి చమురు, ఇతర సరుకులను రష్యా ఆఫర్ చేసింది. ఇందుకు భారత్ సై అన్నట్టుగా కూడా కథనాలు వచ్చాయి.

ఈ అంశంపై తాజాగా అమెరికా స్పందించింది. రష్యా ఆఫర్‌ను ఇండియా స్వీకరించడం.. తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్టు కాదని స్పష్టం చేసింది. కానీ, తమ ఆంక్షల ఉద్దేశాలను గమనించి అవి సరిగా అమలవ్వడానికి అన్ని దేశాలు సహకరించాలని కోరింది. రష్యా ఆఫర్ స్వీకరించి భారత్ ఆ దేశం నుంచి ముడి చమురు చౌకగా దిగుమతి చేసుకోవడం తమ ఆంక్షలను ఉల్లంఘించదని, కానీ, చరిత్రలో భారత్ ఎటువైపు నిలబడాలో నిర్దేశిస్తుందని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో లిఖించే చరిత్రలో భారత్ ఎటువైపు నిలబడాలో ఆ దేశం తీసుకునే నిర్ణయాలు నిర్దేశిస్తాయని, రష్యా ఆఫర్ స్వీకరించి ఉక్రెయిన్‌పై దురాక్రమణను సమర్థించే వైపుగా ఉంటుందా? అని ప్రశ్నించింది. రష్యా నాయకత్వానికి మద్దతు అంటే.. తీవ్ర విధ్వంసానికి కారణం అవుతున్న దురాక్రమణను సమర్థించినట్టే అవుతుందని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి తెలిపారు. రష్యా ఆఫర్‌ను స్వీకరించడం భారత్‌ను తప్పుడు చరిత్రలో భాగం చేస్తుందని హెచ్చరించారు.

కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం, భారత అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రష్యా నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్టు తెలిసింది. గత నెల 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత భారత్.. రష్యా నుంచి జరిపిన తొలి లావాదేవీగా దీన్ని చూస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక చమురును వినియోగించే.. దిగుమతి చేసుకునే దేశం భారత్. మన దేశం రష్యా నుంచి పూర్తిస్థాయిలో లేదా చాలా ఎక్కువ భాగం రష్యా నుంచి అవసరమైన చమురును దిగుమతి చేసుకుంటే.. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల నుంచి రష్యా చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

రష్యా ప్రభుత్వం భారీ డిస్కౌంట్లతో ముడి చమురు, ఇతర సరుకులను విక్రయించే ఆఫర్ ఇచ్చిందని ఇండియా అధికారవర్గాలు రెండు మూడు రోజుల కింద తెలిపాయి. చెల్లింపులకూ రూపీ, రూబుల్ మెకానిజం లావాదేవీలు నెరిపే వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించాయి. ప్రభుత్వం కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ ఆఫర్‌ను స్వీకరించడానికి తాము సంతోషంగా ఎదురుచూస్తున్నామని వివరించాయి. అయితే, తమకు ఈ ఇందులో ట్యాంకర్లు, ఇన్సూరెన్స్ కవర్, ఆయిల్ బ్లెండ్ వంటి కొన్ని అవాంతరాలు ఉన్నాయని తెలిపాయి. వాటిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దిగుమతులు ప్రారంభిస్తామని వివరించాయి. 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?