
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం (Ukraine Crisis) పై భారత్ (India) ఆశించిన స్థాయిలో స్పందించలేదని, రష్యా దాడులతో అగ్నిగుండంగా మారిన ఉక్రెయిన్‌లో భారత పౌరులను వారి మానాన వారినే వదిలిపెట్టిందని కొన్నివర్గాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఆపరేషన్ గంగ’ ప్రకటించింది. అంతేకాదు, కొందరు కేంద్ర మంత్రులను ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి ఏకంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపింది. అయినా.. కేంద్ర ప్రభుత్వంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న అమెరికా పౌరుల కోసం బైడెన్ ప్రభుత్వం ఏం చేసిందో ఓ సారి చూద్దాం.
ఉక్రెయిన్ సంక్షోభంలో మొదటి నుంచి అమెరికా సంచలన ప్రకటనలు చేస్తూ వచ్చింది. రష్యా దాడులకు అమెరికా (America) ప్రధాన కారణం అని రష్యా మిత్రదేశాలూ ఆరోపిస్తున్నాయి. అలాంటి అమెరికా.. ఉక్రెయిన్ దేశం నుంచి తమ పౌరులను ఒక్కరిని కూడా తరలించలేకపోయింది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఊహించని విధంగా ఉన్నాయని, ప్రతి నగరంలో దాడులు జరుగుతున్నాయని అమెరికా తెలిపింది. వచ్చే మరికొన్ని రోజుల్లో ఈ పరిస్థితులు మరింతగా దిగజారిపోతాయని వివరించింది.
కాగా, భారత ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి 1396 మంది భారతీయులను సురక్షితంగా ఇంటికి తరలించింది. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ టాప్ మినిస్టర్లను ప్రత్యేక దౌత్యసిబ్బందిగా పంపారు. రొమేనియా మొల్డోవాల్లో తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి పౌర విమానయాన జ్యోతిరాదిత్య సింధియాను, స్లోవేకియాలో ఈ బాధ్యతలను న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, హంగేరికి పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, పొలాండ్ నుంచి తరలింపులను సమన్వయం చేయడానికి కేంద్ర రోడ్డు రవాణ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్‌ను పంపారు.
రానున్న 24 గంటల్లో మూడు విమానాలు భారత పౌరులతో ఇండియాకు బయల్దేరనున్నాయి. రెండు విమానాలు బుకారస్ట్ నుంచి.. ఒక విమానం బుడాపెస్ట్ నుంచి బయల్దేరి రానున్నాయి.
ఇదే తేడాను ఉక్రెయిన్‌లోని అమెరికా, భారత్ ఎంబసీల అడ్వైజరీల్లోనూ చూడవచ్చు. అమెరికా ఎంబసీ తాము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేయగా, భారత ఎంబసీ మాత్రం ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చేయడానికి సూచనలు చేస్తూ, పలు జాగ్రత్తలు చెబుతూ ఉన్నది.
ఉక్రెయిన్‌లోని పౌరులు సురక్షితం అని భావిస్తే ప్రైవేటు వాహనాల్లో బయల్దేరవచ్చని అమెరికన్ ఎంబసీ పేర్కొంది. ఉక్రెయిన్ రోడ్లపైనా అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయని, కాబట్టి, రూట్లను కూడా సరిగ్గా ఎంచుకోవాలని బయల్దేరాలని వివరించింది. కాగా, భారత ఎంబసీ అడ్వైజరీ చూస్తే.. కీవ్ రాజధానిలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేశారని, కాబట్టి, వెంటనే రైల్వే స్టేషన్‌లకు తరలివెళ్లాలని, తరలింపుల కోసం ఉక్రెయిన్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నదని తెలిపింది. భారతీయులు ఈ తరలింపు ప్రక్రియలో శాంతియుతంగా నడుచుకోవాలని, రైళ్లు ఆలస్యంగా వచ్చినా.. ఒక వేళ రద్దు అయినా ఆగ్రహించరాదని వివరించింది. ఈ మార్గాల ద్వారా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొంది.