
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఒక్క రోజులోనే 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,158 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం తెలియజేసింది. దాదాపుగా గత 8 నెలల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంక్య 44,998కి చేరింది. ఇక, కరోనాతో తాజాగా 19 మంది మరణించారు.
ఇక, దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.42 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 4.02 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.10 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ -19 రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
మరోవైపు దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,86,160, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,10,127, కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,31,035గా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగింది.