
పలు రాష్ట్రాలు, పలు కార్యక్రమాలను కవర్ చేస్తూ రెండు రోజుల పవర్ ప్యాక్డ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సోమవారం దక్షిణాది రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేరళలో ఆయన పర్యటిస్తున్నారు. వివిధ కనెక్టివిటీ, అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచ పటంలో భారత్ ఒక ప్రకాశవంతమైన దేశంగా మారిందని అన్నారు. కేంద్రంలో నిర్ణయాత్మక ప్రభుత్వం, ఆధునిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, యువత, నైపుణ్యాభివృద్ధి, సులభతర జీవనం, వాణిజ్యంపై దృష్టి పెట్టడం దేశ వృద్ధికి కీలక అంశాలుగా మారాయని తెలిపారు.
భారతదేశ రైలు నెట్ వర్క్ శరవేగంగా రూపాంతరం చెందుతోందని, అధిక వేగానికి సిద్ధమవుతోందని ప్రధాన మంత్రి అన్నారు. కేరళ మొదటి వందే భారత్ రైలు, భారతదేశపు మొదటి నీటి మెట్రో ను ఈరోజే అందుకుందని అన్నారు. ప్రపంచంలో భారతదేశ విశ్వసనీయతను పెంచడంలో కేంద్ర ప్రభుత్వ గ్లోబల్ అవుట్ రీచ్ ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయని, ఇతర దేశాల్లో నివసిస్తున్న కేరళీయులు కూడా దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వం సహకార సమాఖ్య విధానానికి పెద్దపీట వేస్తుందని, రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధికి మూలమని భావిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. కేరళ అభివృద్ధి చెందితే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేరళ విద్యావంతులు ఉన్న రాష్ట్రమని కొనియాడారు. ఇక్కడి ప్రజల కఠోర శ్రమ, వినయం వారి గుర్తింపులో భాగంగానే ఉందని అన్నారు. కొచ్చి వాటర్ మెట్రో సహా దేశంలోని చాలా ప్రజా రవాణా వ్యవస్థలు భారతదేశంలో తయారైనవేనని ప్రధాని మోడీ అన్నారు.
కాగా.. కేరళ పర్యటనలో భాగంగా రూ.3,200 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.