రెజ్లర్ల ఆరోపణలపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు..

By SumaBala BukkaFirst Published Apr 25, 2023, 1:16 PM IST
Highlights

డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణల్లో పోలీసుల మీద రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవని సుప్రీం పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 

ఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని స్టార్ రెజ్లర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్ ను స్వీకరించింది. రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవే అని సుప్రీంకోర్టు పేర్కొంది.  వారి ఆరోపణల మీద ఢిల్లీ పోలీసులు తమ స్పందన తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. 

బ్రిజ్ భూషణ్ మీద కేసు నమోదు చేసేలా.. ఆదేశాలు ఇవ్వాలని ఏడుగురు మహిళా రెజ్లర్లు కోరుతూ ఓ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.  సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్  మహిళా రెజ్లర్ల తరఫున  సుప్రీంలో పిటిషన్ వేశారు. బ్రిజ్ భూషణ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఈ పిటిషన్ లో వారు పేర్కొన్నారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్ను స్వీకరించింది. 

Latest Videos

మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు.. జంతర్ మంతర్ వద్ద ఆందోళన

దీనిమీద ఏప్రిల్ 28వ తేదీ శుక్రవారం నాడు విచారణ చేపడతామని  చెప్పింది. ఇది సున్నితమైన కేసు కావడంతో ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచాలని.. దీనికోసం జ్యూడిషియల్ రికార్డుల నుంచి ఆ ఏడుగురు రెజ్లర్ల పేర్లను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఆదివారం నుంచి స్టార్ రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.  

ఈ మేరకు ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ మీద చర్యలు తీసుకునే వరకు తాము నిరసన విరమించబోమని రెస్లర్లు స్పష్టం చేశారు. మే 7వ తేదీన రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరగాల్సి ఉంది.. కాగా రెజ్లర్లు చేపట్టిన ఈ ఆందోళన నేపథ్యంలో ఈ ఎన్నికలను క్రీడా మంత్రిత్వ శాఖ నిలిపేసింది. 

click me!