Coronavirus: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే లక్షన్నరకు పైగా కొత్త కేసులు నమోదుకావడం వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. ఒమిక్రాన్ కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి.
Coronavirus:ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం మొదలైంది. చాలా దేశాల్లో ఆందోళనకర స్థాయిలో Coronavirus కొత్త కేసులు నమోదవుతున్నాయి. చాలా దేశాల్లో రోజువారీ కేసులు లక్షల్లో నమోదుకావడం వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా పరిస్థితులు దిగజారాయి. ఇక భారత్ లోనూ Covid-19 మహమ్మారి విలయతాండవం మొదలైంది. నిత్యం లక్షకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. శనివారం ఒక్కరోజే లక్షన్నర మందికి పైగా వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,59,377 మందికి Coronavirus సోకింది. రోజువారీ కేసులు లక్ష దాటిన రెండు రోజుల్లోనే 1.5 లక్షలకు చేరుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. Covid-19 సేకండ్ వేవ్ సమయంలో 2021 మే 30న చివరిసారిగా లక్షన్నర కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలోనే శనివారం రోజువారీ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,55,28,004 పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ.. 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు 31 నాటికి లక్ష ఉన్న Coronavirus యాక్టివ్ కేసులు.. ప్రస్తుతం ఆరు లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 5,90,611గా ఉన్నాయి. ఇదే సమయంలో 40,863 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తంగా కరోనా వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 3,44,53,603కు పెరిగింది. కరోనా రికవరీ రేటు 97.3 శాతంగా ఉంది. మరణాల రేటు 1.37 శాతంగా ఉంది. Covid-19 పాజిటివిటీ రేటు 5.3 శాతంగా ఉంది. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలను వేగవంతం చేస్తున్నాయి. దీనిలో భాగంగా కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాయి. ఇప్పటివరకు దేశంలో 68,84,70,959 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 15,29,948 Coronavirus శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
ఇదిలావుండగా, కరోనా రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 41,434 కేసులు వెలుగుచూశాయి. ఇదే సమయంలోCovid-19 కారణంగా 13 మంది చనిపోయారు. మహారాష్ట్రలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో అత్యధికం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్క ముంబయిలోనే 20,318 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా ప్రభావం పెరుగుతోంది. రోజువారీ Covid-19 కేసులు కొత్త రికార్డులను నమోదుచేస్తున్నాయి. ఢిల్లీలో కొత్తగా 20,181 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, వైరస్ కారణంగా ఏడుగురు చనిపోయారు. పాజిటివిటీ రేటు 19.60 శాతానికి చేరుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే, కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటిగా నిలిచింది. అక్కడ శనివారం ఒక్కరోజే Covid 18,802 కేసులు వెలుగుచూశాయి. అలాగే, 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోనూ Coronavirus కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి.