భారతం: 6.3% వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ

Bhavana ThotaPublished : May 17, 2025 7:19 AM

2025లో 6.3% వృద్ధితో భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది అని UN అంచనా.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు, పెట్టుబడుల వెనుకంజ, విధానపరమైన అనిశ్చితుల వాతావరణం నెలకొన్న వేళ, భారతదేశం స్థిరమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, భారత జీడీపీ వృద్ధి 2025లో 6.3 శాతానికి చేరవచ్చని చెప్పబడింది. ఈ గణాంకం ప్రపంచంలో ఏ ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థతో పోల్చినా అత్యధికంగా ఉంది. పైగా 2026లో ఈ వృద్ధి 6.4 శాతానికి చేరవచ్చని నివేదిక స్పష్టం చేసింది.

ఐపీఓలు, స్టాక్ మార్కెట్ పనితీరు కూడా ఈ అభివృద్ధికి బలంగా నిలుస్తున్నాయి. 2024లో భారత స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయికి చేరగా, కొత్తగా వచ్చిన ఐపీఓల ద్వారా ₹1.53 లక్షల కోట్లకు పైగా మూలధనం సమీకరించడం జరిగింది. ఇది గతేడాది కంటే మూడు రెట్లు అధికం. ప్రపంచ ఐపీఓ మార్కెట్‌లో భారతదేశం వాటా 17 శాతం నుండి 30 శాతానికి పెరగడం గమనార్హం. హ్యుందాయ్, LG వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు భారతదేశపు అనుబంధ కంపెనీలను భారత మార్కెట్లో లిస్టింగ్ చేస్తున్నాయి.

రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2020లో 4.9 కోట్ల మంది ఉన్నవారు 2024 నాటికి 13.2 కోట్లకు చేరారు. అంటే సాధారణ వ్యక్తి కూడా దేశ అభివృద్ధిలో నేరుగా భాగస్వామి అవుతున్నాడు. దేశీయ డిమాండ్, ప్రభుత్వ పెట్టుబడుల దిశగా వ్యయం పెరగడం వృద్ధికి మరింత మద్దతు ఇస్తోంది.ద్రవ్యోల్బణం 2025లో 4.3 శాతానికి తగ్గే అవకాశముందని అంచనా. ఇది భారత రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం పరిధిలోనే ఉంది. తయారీ రంగం కూడా బలంగా ముందుకెళ్తోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఫలితంగా తయారీ రంగపు మూలధన విలువ ₹15.6 లక్షల కోట్ల (2013-14) నుండి ₹27.5 లక్షల కోట్లకు (2023-24) పెరిగింది.

ఇక రక్షణ తయారీ పరంగా చూస్తే, 2014-15లో ₹46,429 కోట్లుగా ఉన్న విలువ 2023-24 నాటికి ₹1,27,434 కోట్లకు పెరిగింది. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు కూడా ₹686 కోట్ల (2013-14) స్థాయి నుండి ₹23,622 కోట్లకు (2024-25) చేరాయి. ఇప్పుడు భారత ఆయుధాలు 100కు పైగా దేశాలకు ఎగుమతవుతున్నాయి.ఎగుమతుల మొత్తం విలువ 2024-25లో USD 824.9 బిలియన్లకు చేరింది. ఇందులో సేవా రంగం USD 387.5 బిలియన్లతో (13.6% వృద్ధి) కీలక పాత్ర పోషించింది. పెట్రోలియం కాని వస్తువుల ఎగుమతులు USD 374.1 బిలియన్లుగా నమోదయ్యాయి. మొత్తం ఎగుమతులు 2013-14తో పోల్చితే దాదాపు రెండింతలయ్యాయి.ఈ సంక్లిష్ట ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో భారతదేశం ఒక కొత్త అభివృద్ధి నమూనా చూపిస్తూ, నిలకడతో కూడిన పురోగతికి మార్గం వేస్తోంది.

Read more Articles on
click me!