తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు.. ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య ముదురుతున్న ముసలం.. శశికళకు బీజేపీ వెల్‌కమ్

By Mahesh KFirst Published Jun 1, 2022, 4:39 PM IST
Highlights

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత ప్రభుత్వాన్ని నడిపిన ఏఐఏడీఎంకే, బీజేపీ పార్టీల మధ్య దూరం పెరుగుతున్నది. ఇదే తరుణంలో ఏఐఏడీఎంకే నాయకత్వం వ్యతిరేకిస్తున్న శశికళను పార్టీలోకి స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్టు తమిళనాడు బీజేపీ వెల్లడించడం చర్చనీయాంశమైంది.
 

చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు సరికొత్త మలుపులు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య డిస్టెన్స్ పెరుగుతున్నది. ఏఐఏడీఎంకే బ్యానర్ చూపి బీజేపీ సీట్లు గెలుచుకుందని, ఇప్పుడు ప్రజలే తమను ఆశీర్వదించారని గొప్పలు చెప్పుకుంటున్నదని ఏఐఏడీఎంకే సీనియర్ నేతల్లో అసంతప్తి రగులుతున్నది. అందుకే తాజాగా, రాష్ట్ర హక్కుల కోసం గళం ఎత్తని బీజేపీని ఎక్స్‌పోజ్ చేయాలని ఏఐఏడీఎంకే తన ఐటీ వింగ్‌ను ఆదేశించినట్టు సమాచారం. ఈ తరుణంలోనే మరో కీలక పరిణామం లముందుకు వచ్చింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జైలు నుంచి బయటకు వచ్చిన శశికళను ఏఐఏడీఎంకే ఆహ్వానించలేదు. అసలు పార్టీలోకే తీసుకోలేదు. పార్టీలో చేరవద్దని ఏకంగా బీజేపీ అగ్రనాయకత్వం కూడా శశికళకూ హెచ్చరికలు చేసినట్టు అనధికారికంగా అప్పుడు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెనే స్వయంగా క్రియా శీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఓ ప్రకటన ఇచ్చారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే దారుణంగా ఓడిపోయింది. ఆ తర్వాత శశికళ మళ్లీ పార్టీ నాయకత్వ పగ్గాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, ఏఐఏడీఎంకే జాయింట్ కోఆర్డినేటర్, మాజీ సీఎం పళనిస్వామి మాత్రం ఆమెను పార్టీలోకి తీసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో శశికళను తాము చేర్చుకోవడానికి రెడీగా ఉన్నామని తమిళనాడు బీజేపీ అభిప్రాయపడటం సంచలనంగా మారింది. శశికళను ఆహ్వానించడానికి పార్టీ సిద్ధంగా ఉన్నదని తమిళనాడు బీజేపీ బుధవారం వెల్లడించింది. బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నగేంద్రన్ మాట్లాడుతూ, చిన్నమ్మను ఏఐఏడీఎంకే చేర్చుకుంటే ఆ పార్టీ మరింత శక్తివంతం అవుతుందని అన్నారు. ఒక వేళ చిన్నమ్మ బీజేపీలో చేరాలని భావిస్తే.. ఆమెను ఆహ్వానించడానికి మేం రెడీగా ఉన్నాం అని ఆయన తెలిపారు.

శశికళ మాత్రం ఏఐఏడీఎంకే పగ్గాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏఐఏడీఎంకేలో చాలా మంది నేతలు, కార్యకర్తలు తనను ఆహ్వానిస్తున్నారని, కొందరు నేతలు మాత్రమే తనకు అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు. పార్టీ ఎన్నికలు కోరుతున్నవారే తనను వ్యతిరేకిస్తున్నారని వివరించారు. కొందరు పార్టీ పదవుల కోసం కూడా తనను వద్దని అంటున్నట్టు ఆరోపించారు. అసలు ఆ పార్టీని తమ నాయకుడు స్టార్ట్ చేశాడని, దానికి ఎవరు నాయకత్వం వహించాలనేది పార్టీ క్యాడర్ నిర్ణయించాలని అన్నారు.

click me!