Covid Deaths: దేశంలో గత 24 గంటల్లో 2,796 కోవిడ్ మరణాలు.. అసలు కారణమేమిటంటే..?

By team teluguFirst Published Dec 5, 2021, 12:34 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులకు (Covid Cases in India) సంబంధించిన డేటాను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతి రోజు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా రిపోర్ట్‌లో ఇండియాలో 2,796 మరణాలు చోటుచేసుకున్నట్టుగా పేర్కొంది.
 

దేశంలో కరోనా కేసులకు (Covid Cases in India) సంబంధించిన డేటాను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతి రోజు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసులు, మరణాల వివరాలతో కూడిన సమగ్రమైన డేటాను కేంద్రం ప్రకటిస్తుంది. అయితే ఆదివారం విడుదల చేసిన బులిటెన్ చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గడిచిన 24 గంటలకు సంబంధించిన డేటాలో (Covid data) దేశవ్యాప్తంగా.. 2,796 మంది మృతి చెందినట్టుగా ఉండటం ఆందోళన కలిగించింది. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన మే, జూన్ నెలల తర్వాత ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో మరణాలకు సంబంధించిన గణంకాలు ప్రకటించడమే. అయితే అందుకు గల కారణాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

2,796 మరణాలలో, 2,426 జాతీయ కోవిడ్ డేటాబేస్‌లో సర్దుబాటు చేయబడిన మరణాలు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీహార్ తన COVID-19 డేటాను పునరుద్దరించిందని.. దానికి అనుగుణంగా గణాంకాలు అప్‌డేట్ చేయబడ్డాయని పేర్కొంది. అలాగే కేరళ కూడా 263 మరణాల బ్యాక్‌లాగ్‌ను డేటాను క్లియర్ చేయడంతో ఆ గణంకాలను కూడా జోడించడం జరిగిందని తెలిపింది. ఇక, కేంద్రం విడుదల చేసిన డేటాలో బిహార్‌లో 2,426, కేరళలో 315 మరణాలు ఉన్నట్టుగా చూపించారు.

Also read: Omicron: ఢిల్లీలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదు, ఇండియాలో మొత్తం ఐదుకి చేరిక

ఇదిలా ఉంటే.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో  8,895 క‌రోనా (Coronavirus) కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,33,255 కు చేరింది.  ప్ర‌స్తుతం 99,155 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,40,60,774 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల్లో 6,918 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు ప్రస్తుతం 98.35 శాతంగా ఉంది.  మ‌ర‌ణాల రేటు 1.36 శాతంగా ఉంది.

ఇక, దేశవ్యాప్తంగా  1,27,61,83,065 కోవిడ్ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 138 కోట్ల డోసులు పంపిణీ చేశామని, ఇంకా 21.13 కోట్లు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

click me!