భారత్‌పై కన్నేసే గట్స్ ఎవరికీ లేవు: కేంద్ర రక్షణ సహాయ మంత్రి

By Mahesh KFirst Published Nov 2, 2022, 7:13 PM IST
Highlights

భారత రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ బుధవారం ప్రత్యర్థి దేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. భారత్ పై కన్నేసే గట్స్ ఎవరికీ లేవని అన్నారు. ఒక వేళ ఎవరైనా ఆ సాహసానికి ఒడిగడితే తక్షణమే దీటుగా స్పందించే సామర్థ్యం భారత్‌కు ఉన్నదని తెలిపారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దుష్ట కన్ను వేసే గట్స్ ఎవరికీ లేవని స్పష్టం చేశారు. ఎవరైనా ఆ దుస్సాహసానికి ఒడిగడితే తక్షణమే ప్రతిస్పందించే సామర్థ్యం భారత్‌కు ఉన్నదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో జల, భూ, వాయు విభాగాల్లో మన దేశం ఒక గురువుగా అవతరిస్తున్నదని వివరించారు.

లడాఖ్‌లో చైనా దుందుడుకు గురించి ఆయనను విలేకరులు ప్రశ్నించారు. చైనా గురించి తాను నేరుగా స్పందించడానికి నిరాకరించారు. తాను కొన్ని విషయాలపై బహిరంగంగా మాట్లాడే అవకాశం లేదని వివరించారు. అందుకే ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కన్నేసే గట్స్ ఎవరికీ లేవని అన్నారు. ఎవరైనా అందుకు తెగబడితే తక్షణమే అందుకు ధీటైన సమాధానం చెప్పే సామర్థ్యం భారత్‌కు ఉన్నదని వివరించారు. గ్లోబల్ మీట్ ఆన్ డిఫెన్స్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఎనర్జీని ప్రారంభిస్తూ భట్ మాట్లాడారు.

Also Read: India-China Ties: "అక్క‌డ శాంతికి విఘాతం క‌లిగిస్తే.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం"

స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) ప్రకారం, టాప్ 25 దేశాల లీగ్‌లో భారత్ కూడా చేరింది. రక్షణ పరికరాలు, ఆయుధాలను ఎగుమతులు చేసే దేశాల సరసన భారత్ కూడా నిలుస్తున్నది.

రక్షణ పరికరాలు, ఆయుధాలను సప్లై చేసే విషయాన్ని కేంద్ర మంత్రి అజయ్ భట్ ప్రస్తావించారు. ‘మనం ఇప్పుడు రక్షణ పరికరాలు, రాకెట్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లు, ట్యాంక్‌లు, రైఫిళ్లు, పేలుడు పదార్థాలను పెద్ద మొత్తంలో సప్లై చేస్తున్నాం. ఇది వరకు మనం వీటి కోసం ఇతర దేశాల నుంచి అడిగి దిగుమతి చేసుకునేవారం. కానీ, ఇప్పుడు మనం ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఇతర దేశాలకు ఇస్తున్నాం’ అని తెలిపారు. అంతేకాదు, భారత్ విశ్వగురువుగా పరిణమిస్తున్నదని అన్నారు.

click me!