
కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ఐటీ దాడులు కలకలం రేపతున్నాయి. తాజాగా పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) పెర్ఫ్యూమ్ వ్యాపారులు, మరికొంతమందికి సంబంధించిన అనేక స్థలాలపై ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) శుక్రవారం దాడులు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాన్పూర్, కన్నౌజ్, ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పాయి.పెర్ఫ్యూమ్, దానికి సంబంధిత వ్యాపారాలు నిర్వహిస్తున్న కొన్ని సంస్థలకు చెందిన పలుచోట్ల సోదాలు జరుగుతున్నట్టుగా పేర్కొన్నాయి. అయితే తాము దాడి చేస్తున్న వారి వివరాలను మాత్రం అధికార వర్గాలు ధ్రువీకరించలేదు.
ఐటీ దాడులు చేస్తున్న వాటిలో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న పెర్ఫ్యూమ్ వ్యాపారి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ వేదికగా తెలిపింది. కన్నౌజ్‌లోని తమ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ (Pushpraj Jain) నివాస ప్రాంగణంలో సోదాలు జరిగినట్లు సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది. బీజేపీ యూపీ ఎన్నికలకు భయపడి.. కేంద్ర ఏజెన్సీలను బహిరంగంగా దుర్వినియోగం చేయడం సర్వ సాధారణంగా మారిందని ఆరోపించింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఓటు ద్వారా సమాధానం చెప్తారని పేర్కొంది.
కొద్దిసేపట్లో కన్నౌజ్‌లో మాజీ సీఎం, తమ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) విలేకరులతో మాట్లాడాల్సిన సమయంలో బీజేపీ ప్రభుత్వం ఈ దాడులు ప్రారంభించిందని సమాజ్ వాద్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుష్పరాజ్ జైన్ తయారు చేసిన ‘సమాజ్‌వాదీ ఇత్రా’ (Samajwadi ittra) అనే పెర్ఫ్యూమ్‌ను యాదవ్ ఇటీవల విడుదల చేశారు.
కొద్ది రోజుల క్రితం పీయూష్ జైన్ నివాసంపై..
ఇక, ఇటీవల పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్‌కు చెందిన కాన్పూర్, కన్నౌజ్ ప్రాంగణాల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (CBIC) ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) పెద్ద ఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రూ. 197 కోట్లకు పైగా నగదును, 26 కిలలో బంగారం, భారీగా గంధపు నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీయూష్ జైన్‌ను అరెస్ట్ చేశారు. ఇది జరిగిన వారం రోజులకే పుష్పరాజ్ జైన్‌తో పాటుగా మరికొందరు వ్యాపారులపై ఐటీ శాఖ దాడులు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.