గాడిదల చోరీతో పోలీసులకు తంటా.. స్టేషన్ ఎదుట ధర్నా.. ‘ఇవి మా గాడిదలు కావు.. అవి పిలిస్తే వస్తాయి’

By Mahesh KFirst Published Dec 31, 2021, 2:55 PM IST
Highlights

రాజస్తాన్‌లో సుమారు 40 గాడిదలు చోరీకి గురైన ఘటన పోలీసులను వెంటాడుతున్నది. తమ గాడిదలను కచ్చితంగా వెతికి పట్టుకోవాలని యజమాని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసును లైట్ తీసుకున్నా.. కొందరు నేతలతో కలిసి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో నలుగురైదుగురితో కలిసి ప్రత్యేక బృందంగా పోలీసులు ఏర్పడి ఓ 15 గాడిదలను వెతికి తెచ్చారు. వాటిని ఆ యజమానిపేర్లు పెట్టి పిలవగా స్పందించలేవు. దీంతో అవి తమ గాడిదలు కావని, తమ గాడిదలనే తేవాల్సిందిగా కోరారు.
 

జైపూర్: రాజస్తాన్‌(Rajasthan)లో సుమారు 40 గాడిదలు(Donkeys) చోరీ(Robbery)కి గురయ్యాయి. వాటిని వెతికి పెట్టాల్సిందిగా పోలీసు(Police) స్టేషన్‌లో వాటి యజమాని ఫిర్యాదు చేశాడు. గాడిదలను వెతకడం ఏంటీ.. ఇంకెన్నో ముఖ్యమైన కేసులు ముందు ఉన్నాయి అని పోలీసులు లైట్ తీసుకున్నారు. కానీ, ఆ యజమాని, మరికొందరు రాజకీయ నేతలు కలిసి పోలీసు స్టేషన్ ఎదుట ఏకంగా ధర్నాకు దిగారు. కచ్చితంగా తమ గాడిదలను వెతికి పట్టుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేకంగా ఓ టీమ్‌గా ఏర్పడి చుట్టు పక్కల ఊళ్లలో గాలింపులు జరిపారు. ఓ పదిహేను గాడిదలను వెంటబెట్టుకు వచ్చారు. వాటిని తీసుకెళ్లాల్సిందిగా యజమానిని కోరారు. యజమాని వాటి దగ్గరకు చేరి.. పేర్లు పెట్టి పిలిచాడు. కానీ, ఆ గాడిదలు కదల్లేదు.. మెదల్లేదు. దీంతో ఆ యజమాని మరో తిరకాసు పెట్టాడు. అవి తమ గాడిదలు కావని స్పష్టం చేశారు. తమ గాడిదలకు తాము పేర్లు పెట్టామని, ఆ పేరర్లతో పిలిస్తే కచ్చితంగా అవి స్పందించి దగ్గరకు వస్తాయని చెప్పారు. ఆ పేర్లతో ఈ గాడిదలు స్పందించనందున అవి తమ గాడిదలే కావని తేల్చి పారేశారు. కాబట్టి, తమ గాడిదలను మాత్రమే వెతికి తేవాలని మరో అల్టిమేటం పెట్టారు. ఆ గాడిదలకు కనీసం ప్రత్యేకంగా గుర్తులు కూడా పెట్టలేదని, వాటిని ఎలా గుర్తించేది.. ఎలా వెతికి పట్టేదని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఉదంతం రాజస్తాన్‌లోని హనుమాన్‌గడ్ జిల్లాలో జరిగింది.

అవసరమైన సరుకులను గాడిదలపై మోయించుకుని ఆ తర్వాత వాటిని కెనాల్ ప్రాంతంలో మేపడానికి యజమాని వదిలిపెట్టేవాడు. కొన్నాళ్ల క్రితం అలాగే వదిలేశాడు. కానీ, అవి కనిపించకుండా పోయాయి. చుట్టుపక్కల గాలించాడు. దొరకలేదు. గాడిదలను వెతికి పట్టాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కొందరు తెలివికల్ల యువకులు ఆ యజమానికి సలహా ఇచ్చారు. దీంతో ఖుయాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు తొలుత దాదాపు నవ్వినంత పని చేశారు. కేసు రిపోర్ట్ చేసి పక్కన పడేశారు. కానీ, ఆ యజమాని ఊరుకోలేదు. కొంత మంది సీపీఎం నేతలతో కలిసి పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశాడు. ఆ గాడిదలతోనే తనకు జీవనాధారం అని, వాటిని కచ్చితంగా వెతికి పట్టుకోవాల్సిందిగా మంగళవారం డిమాండ్ చేశారు. ఎలాగోలా అదే రోజు రాత్రి కల్లా పోలీసులు 15 గాడిదలను వెతికి తెచ్చారు. కానీ, యజమాని వాటిని పేర్లు పెట్టి పిలిచినా.. స్పందించకపోవడంతో అవి తమ గాడిదలు కావని యజమాని తెలిపారు. చింటూ, పింటూ, బబ్లు, కల్లు వంటి పేర్లను ఆ గాడిదలకు యజమాని పెట్టుకున్నాడు.

Also Read: సినీ ఫక్కిలో దోపిడీ.. భార్యగా మెట్టినింటికీ.. అంతలోనే నగదు సర్దుకుని పరార్

తమ గాడిదలనే వెతికి తేవాలని, తమ ఆజ్ఞలను అవి మాత్రమే వింటాయని యజమాని బోరుమన్నాడు. కాబట్టి, వాటిని తెచ్చే వరకు ఎదురు చూస్తామని తెలిపారు. పోలీసులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. గాడిదలన్నీ చూడటానికి ఒకే విధంగా కనిపిస్తాయని, పక్కాగా ఈ గాడిదలు మాత్రమే తప్పిపోయినవని ఎలా గుర్తించేదని అంటున్నారు. కనీసం వాటికి ఎలాంటి ప్రత్యేక మార్కింగ్‌లూ లేవని, ఒక వేళ కష్టపడి వెతికి తెచ్చినా.. యజమాని పేర్లకు స్పందించకుండా తమ శ్రమ అంతా వృథానే కదా అని పోలీసులు చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు వస్తున్నందున రాజకీయ నాయకులు యజమానికి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. 302, 307, ఎన్‌డీపీఎస్ వంటి సీరియస్ క్రిమినల్ కేసులు స్టేషన్‌లో నమోదై ఉన్నాయని, ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఆ కేసులను పక్కన బెట్టి.. గాడిదలను వెతకాల్సి వస్తున్నదని పోలీసులు చెప్పారు. ఈ కేసుపై స్థానికులు జోకులు చేసుకుంటున్నా.. పోలీసులకు మాత్రం తీవ్ర ఒత్తిడి కలుగుతున్నది.

click me!