సీపీఆర్ థింక్ ట్యాంక్, మీడియాకు ఫండింగ్ ఇస్తున్న ట్రస్ట్‌పై ఐటీ దాడులు

By Mahesh KFirst Published Sep 7, 2022, 11:12 PM IST
Highlights

స్వతంత్ర మేధో సంస్థ సీపీఆర్, స్వతంత్ర డిజిటల్ వెబ్ సైట్ వార్తాసంస్థలకు ఫండింగ్ ఇస్తున్న ఐపీఎస్ఎంఎఫ్ ట్రస్టు, ఆక్స్‌ఫామ్ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సర్వేలు చేపడుతున్నది. ఇవన్నీ కూడా ప్రభుత్వంపై విమర్శనాత్మక దృక్పథం కలిగి ఉండటం గమనార్హం.
 

న్యూఢిల్లీ: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ దేశ రాజధాని ఢిల్లీలోని స్వతంత్ర థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్), ఆక్స్‌ఫామ్ ఇండియా చారిటీ సంస్థ, బెంగళూరుకు చెందిన ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్ (ఐపీఎస్ఎంఎఫ్) కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. స్వతంత్ర డిజిటల్ మీడియా సంస్థలు ది కారవాన్, ది ప్రింట్, స్వరాజ్య వంటి సంస్థలకు ఐపీఎస్ఎంఎఫ్ ఫండింగ్ చేస్తున్నది. అయితే, ఈ దాడుల నుంచి సదరు సంస్థల నుంచి అధికారిక ప్రకటనలేవీ ఇంకా రాలేవు.

ఐటీ శాఖలోని కొన్ని వర్గాలు జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి కీలక సమాచారాన్ని ఇచ్చాయి. హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, ఇతర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 20కి పైగా రిజిస్టర్డ్ బట్ నాన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఫండింగ్‌పై ‘సర్వే’లు చేస్తున్నది. విదేశీ విరాళాలపై దర్యాప్తులో  భాగంగా ఈ సర్వేలు జరుగుతున్నట్టు ఆ వర్గాలు వివరించాయి.

బెంగళూరుకు చెందిన ట్రస్ట్ ఐపీఎస్ఎంఎఫ్ పరిశోధనాత్మక కథనాలతో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తున్న మీడియా సంస్థలకు ఫండ్స్ ఇస్తున్నది. ఈ ట్రస్ట్ ఫండింగ్ చేస్తున్న ది కారవాన్ అనే వెబ్ సైట్ ఔట్‌లెట్ ఇటీవలే ఒక సంచలన కథనం ప్రచురించింది. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి పాత్ర లేదని ఓ రిపోర్టును ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఆ రిపోర్టును అనేక ప్రశ్నలతో ది కారవాన్ పత్రిక ఇటీవలే ఓ సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది.

ఐపీఎస్ఎంఎఫ్ చైర్‌పర్సన్ జర్నలిస్టు టీఎస్ నీనన్, అమోల్ పాలేకర్, సహా పలువురు ట్రస్టీలుగా ఉన్నారు. ప్రేమ్‌జీ, గోద్రేజ్, నిలేకనీ బిజినెస్ ఫ్యామిలీలు దీనికి డోనర్లుగా ఉన్నారు.

సీపీఆర్ కూడా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను విమర్శించే పనిలో ఉన్నది. ప్రభుత్వ పాలసీని ఈ థింక్ ట్యాంక్ విమర్శనాత్మక దృక్పథంతో చూస్తున్నది. ఈ సంస్థను గతంలో ప్రముఖ విద్యావేత్త ప్రతాప్ భాను మెహెతా ఉన్నారు. ఈయన బీజేపీ ప్రభుత్వ విమర్శకుడు. ప్రస్తుతం ఈ సంస్థను జేఎన్‌యూలో బోధకురాలైన మీనాక్షి గోపీనాథ్‌ లీడ్ చేస్తున్నారు. 1973లో ఏర్పడ్డ సీపీఆర్ ప్రాసంగికమైన ప్రశ్నలు వేసే ప్రధాన లక్ష్యాన్ని కలిగి ఉంది.

ఆక్స్‌ఫామ్ ఇండియా కూడా ఈ యాక్షన్ ఎదుర్కొంటున్నది. భారత రాజ్యాంగం సూచిస్తున్న సంఘటిత రాజ్యం కోసం విధానాలను మార్చుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేసేలా తాము క్యాంపెయిన్ చేపడుతున్నామని ఈ సంస్థ వెబ్ సైట్ పేర్కొంటూ ఉండటం గమనార్హం. 

చాణక్యపురిలోని సీపీఆర్ కార్యాలయంలో మధ్యాహ్నం నుంచ ిపది మంది కంటే ఎక్కువ మంది అధికారులు ఉన్నారని కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ రాత్రి మొత్తం సర్వే కొనసాగే అవకాశం ఉన్నది. ఐటీ అధికారులు.. ఆ సంస్థ ఉద్యోగులను బయటకు విడిచిపెట్టడం లేదు.

click me!