
4 Drown In UP River While Bathing After Holi: హోలీ వేళ విషాదం చోటుచేసుకుంది. హోలీ తర్వాత స్నానం చేస్తుండగా నదిలో మునిగి నలుగురు మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. హోలీ వేడుకల అనంతరం గోమతి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లో హోలీ వేడుకల తర్వాత గోమతి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు. గోమతి నదిలోని సీతాకుండ్ ఘాట్ లో మునిగి నలుగురు మృతి చెందారు. మొదట ఒకరు నీటిలో మునిగిపోతుండగా, కాపాడటానికి వెళ్లినవారు కూడా రుసగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో వారంతా నీటిలో మునిగిపోయారనీ, బుధవారం మూడు మృతదేహాలు, గురువారం మధ్యాహ్నం నాలుగో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సుల్తాన్ పూర్ జిల్లా మేజిస్ట్రేట్ జస్జిత్ కౌర్ తెలిపారు.
నీట మునిగిన నలుగురు యువకుల వయస్సు 18-32 ఏళ్ల మధ్య ఉంటుందని కౌర్ తెలిపారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. వారి దహన సంస్కారాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ జస్జీత్ కౌర్ పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు.