
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక, సాంస్కృతి, సంప్రదాయాలే కాదు.. రాజకీయాలు, వారి డిమాండ్లు కూడా భిన్నంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో రాజకీయాలు మరింత విభిన్నమైనవి. ఈ రాష్ట్రంలో అధికారపక్షమే కానీ, విపక్షమే లేకుండా పోయింది. గతేడాది రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష కూటమితో మిలాఖత్తయింది. ఆ రాష్ట్రంలో విపక్షంలేని అధికారపక్ష కూటమి పార్టీల్లో ఇప్పుడు కొత్త
సమీకరణాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
నాగాలాండ్‌లో మూడు పార్టీల శాసనసభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉన్నారు. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్), బీజేపీలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్‌డీపీపీ, బీజేపీలు అధికారాన్ని చేపట్టాయి. ఈ కూటమికి పీపుల్స్ డెమోక్రటిక్ అలయెన్స్‌గా పేరుపెట్టుకున్నారు. కానీ, ఆ తర్వాత గతేడాది ప్రతిపక్షంలోని ఎన్‌పీఎఫ్ కూడా అధికారపక్షంలో కలిసింది. నాగాలాండ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము అధికారపక్షంతోని కలువబోతున్నట్టు అప్పుడు చెప్పింది. గతేడాది ఈ అలయెన్స్ యూడీఏగా మారింది. యునైటెడ్ డెమోక్రటిక్ అలయెన్స్‌గా ఎన్‌డీపీపీ, ఎన్‌పీఎఫ్, బీజేపీలు కలిసి ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల మధ్య ముసలం ముదురుతున్నది.
తాము నాగాల్యాండ్ సమస్యల కోసం అధికారపక్షంలో కలిశామని, అంతేకానీ, మరేమీ ఆశించలేదని ఎన్‌పీఎఫ్ అధ్యక్షుడు షురోజెలీ లిజెసు ఓ ర్యాలీలో తెలిపారు. అందుకే తాము వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్‌పీఎఫ్‌లో కలవరం మొదలైంది. ఈ ప్రకటన తర్వాతే 21 మంది ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలు.. సీఎం నీఫు రియో సారథ్యంలోని ఎన్‌డీపీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్‌పీఎఫ్‌లో ప్రస్తుతం ఇంకా నలుగురు సభ్యులే ఉన్నారు. దీంతో ఎన్‌డీపీపీ పార్టీ బలం ఒక్కసారిగా 42కు పెరిగింది.రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 60. కాగా, ఇందులో ఎన్‌డీపీపీకి 42, ఎన్‌పీఎఫ్కి 4, బీజేపీకి 12 మంది చట్ట సభ్యులు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
దీంతో అధికారపక్షంలోనే ఉన్నప్పటికీ పార్టీల మధ్య ఫిరాయింపులు జరుగుతున్నా యి. ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలో చేరిన ఎన్‌పీఎఫ్ తాజా మార్పుతో తన బలాన్ని దారుణంగా కోల్పోయింది. 25 మంది ఎమ్మెల్యేల్లో ఈ పార్టీకి ఇప్పుడు నలుగురు మాత్రమే మిగిలారు. అయితే, ప్రభుత్వ ప్రతినిధి నీబా క్రోనుల మాట్లాడుతూ, ఈ పార్టీల మార్పుతో ప్రభుత్వంతో మార్పు ఏమీ రాదని స్పష్టం చేశారు. యూడీఏ ప్రభుత్వం యధావిధిగా పని చేసుకుంటుందని తెలిపారు.
కాగా, నాగాలాండ్ స్పీకర్ శేరింగైన్ లోంగ్‌కుమార్ మాట్లాడుతూ, ఎన్‌పీఎఫ్ 21 మంది సభ్యులతో శాసనసభా పక్షమే ఎన్‌డీపీపీలోకి చేరుతున్నట్టు తనకు సమాచారం వచ్చిందని వివరించారు. ఈ మార్పు అనుమతి కోసం తనకు ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు.