మొత్తం ప్రతిపక్షమే ప్రభుత్వంలో కలిసింది.. ఆ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం

By telugu teamFirst Published Sep 19, 2021, 5:22 PM IST
Highlights

నాగాలాండ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మొత్తం ప్రతిపక్షమే అధికారపక్షంలో చేరింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష రహిత ప్రభుత్వమున్నది. దాన్నే యునైటెడ్ డెమోక్రటిక్ అలయెన్స్‌గా నామకరణం చేశారు.
 

గువహతి: భారత రాజకీయాల్లో ఈశాన్య రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేకమైన విశిష్టతలున్నాయి. అక్కడి రాజకీయాలు మిగతా దేశ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. తాజాగా, నాగాలాండ్‌లో ఇలంటి పరిణామమే ఒకటి చోటుచేసుకుంది. ప్రతిపక్షమంతా ప్రభుత్వంతో చేతులు కలిపిన అరుదైన ఘటన చోటుచేసుకుంది. అంతేకాదు, ఎమ్మెల్యేలందరూ కలిసి ఆ కూటమి ప్రభుత్వానికో పేరు పెట్టారు. నాగాలాండ్ ప్రభుత్వానికి ‘యునైటెడ్ డెమోక్రటిక్ అలయెన్స్’(యూడీఏ) అనే పేరు పెట్టడానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 

ప్రభుత్వానికి కొత్త పేరు పెట్టినట్టు సీఎం నెయిఫీ రియో వెల్లడించారు. ప్రతిపక్ష రహిత తమ ప్రభుత్వానికి యునైటెడ్ డెమోక్రటిక్ అలయెన్స్ అని పేరుపెట్టినట్టు ట్వీట్ చేశారు. ఎన్‌డీపీపీ, బీజేపీ, ఎన్‌పీఎఫ్, స్వతంత్ర ఎమ్మెల్యేలందరూ ఈ పేరుకు ఆమోదం తెలిపారని వివరించారు. ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్టు తెలిపారు.

నాగాలాండ్‌లో ప్రతిపక్షంలో ఉన్న నాగా పీలపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్) జులై 19న సీఎం రియోకు ఓ లేఖ రాసింది. నాగా రాజకీయ సమస్యను పరిష్కరించడానికి అఖిలపక్ష ప్రభుత్వంతో సులువు అవుతుందని సూచించింది. కాబట్టి, అన్ని పార్టీల ప్రభుత్వానికి అవకాశమివ్వాలని తెలిపింది. రియో సారథ్యంలోని పీడీఏ ఎన్‌పీఎఫ్‌తో కలిసి ఐదు అంశాలపై తీర్మానం చేసింది. అన్ని రాజకీయ పార్టీలు నాగా శాంతి చర్చలకు సహకరించాలని, శాంతి స్థాపనకు దోహదపడాలని తెలిపింది. 

నాగా మూవ్‌మెంట్ మనదేశంలోనే సుదీర్ఘంగా జరుగుతున్న తిరుగుబాటుగా చెబుతుంటారు. 1997లో కేంద్ర ప్రభుత్వం నాగా రెబల్ గ్రూప్ నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2015లో మరోసారి చర్చలు చేసి రాజకీయ పరిష్కారానికి అడుగులు వేసింది. ఇంకా శాంతి స్థాపనకు కృషి జరుగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షమూ అధికారపక్షంలో కలిసిపోయింది.

click me!