
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే అక్కడ రాజకీయ నేతలు ప్రలోభాలకు తెరలేపారు. అక్కడ నగదు, లిక్కర్, కనకం వర్షంలా కురుస్తున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు, లిక్కర్, బంగారం, తాయిలాలు పంచుతున్నారు. గురువారం ఒక్క రోజే నిప్పని, భద్రావతి, గదగ్, నార్గుండ్‌లో రూ. 4.45 కకోట్ల నగదు పట్టుబడిందంటేనే.. అక్కడ ఏ స్థాయిలో నగదు చలామణి అవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ఎన్నికల కమిషన్ చెప్పిన లెక్క ఇది.
ఇది కాకుండా 62,826 లీటర్ల లిక్కర్ (రూ. 1.89 కోట్ల విలువైన లిక్కర్)ను ఎక్సైజ్ శాఖ పట్టుకుంది.
ధార్వాడ్ నియోజకవర్గంలో 725 గ్రాముల బంగారం (రూ. 45 లక్షల విలువ)ను స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ సీజ్ చేసింది. బెంగళూరు నగరంలోని బ్యాతరాయనపుర నియోజకవర్గంలో రూ. 34 లక్షల విలువైన తాయిలాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ సీజ్ చేసింది.
బెళగావిలోని ఖానాపూర్ తాలూకాలో గురువారం ఒక్క రోజే రూ. 4.61 కోట్ల నగదు, 395 గ్రామలు బంగారం (విలువ సుమారు రూ. 21.25 లక్షలు), 28 కిలోల వెండి సీజ్ చేశారు. మొత్తంగా చూసుకుంటే 27.38 కోట్ల డబ్బు, 26.38 కోట్ల విలువైన లిక్కర్, 88 లక్షల విలువైన డ్రగ్స్, రూ. 9.87 కోట్ల విలువైన 25.24 కిలోల బంగారం, రూ. 12.49 కోట్ల విలువైన తాయిలాలను సీజ్ చేశారు.