నలుగురు ఓటర్లకు స్పెషల్ పోలింగ్ బూత్

By ramya neerukondaFirst Published Nov 7, 2018, 3:50 PM IST
Highlights

అక్కడ కేవలం నలుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.
 

కేవలం నలుగురు ఓటర్ల కోసం.. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సంఘటన ఛతీస్ గఢ్  రాష్ట్రంలో చోటుచేసుకుంది. సాధారణంగా గ్రామానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. కాస్త జనాలు తక్కువగా ఉన్నారు అనిపిస్తే.. రెండు మూడు గ్రామాలకు కలిసి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం నలుగురు అభ్యర్థుల కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వచ్చే వారు ఛతీస్ గఢ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయి పోలింగ్‌ను నమోదు చేయాలనే ఉద్దేశంతో అతి కష్టమైన ప్రదేశాలకు కూడా వెళ్లి పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే భరత్‌పూర్‌-సోన్‌హట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నెంబరు 143ని షిరందఢ్‌ గ్రామానికి వెళ్లారు. అక్కడ కేవలం నలుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.

తొలి దశ పోలింగ్‌ జరిగే ఒకరోజు ముందు ఆ ప్రాంతానికి వెళ్లి పోలింగ్‌ కోసం టెంట్‌ ఇతర ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎన్‌కే దుగ్గా తెలిపారు. షిరందఢ్‌ గ్రామం అటవీ ప్రాంతం. అక్కడికి వెళ్లడం సాహసంతో కూడిన విషయం.

ఐదారు కిలోమీటర్ల దూరం పాటు కొండెక్కి ఆ తర్వాత ఓ నదిని దాటితే కానీ ఆ ప్రాంతానికి చేరుకోలేదు. ప్రధాన రహదారికి ఈ గ్రామం 15కిలోమీటర్ల దూరంలో ఉంది. నవంబరు 12న తొలి దశ పోలింగ్‌ జరగనుండగా.. 20న రెండో దశ పోలింగ్‌ జరగనుంది. 18 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబరు 7న ఫలితాలు వెలువడనున్నాయి.

click me!