చరిత్రాత్మక నిర్ణయం.. ఆలయ ప్రవేశంపై నిషేధానికి వ్యతిరేకంగా 300 మంది దళితులు త్వరలో టెంపుల్‌లోకి.. వివరాలివే

By Mahesh KFirst Published Jan 30, 2023, 2:07 PM IST
Highlights

తమిళనాడులో దశాబ్దాలుగా దళితుల ఆలయప్రవేశంపై నిషేధం ఉన్నది. ఈ నిషేధాన్ని ఎత్తివేసి వారికి ఆలయ ప్రవేశం కల్పించడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్థానికంగా ఉన్న ఆధిపత్య వర్గాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. త్వరలోనే దళితులను ఆలయ ప్రవేశం కల్పించనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులూ ఆ సమయంలో ఆలయం వెలుపల మోహరించనున్నారు.
 

చెన్నై: తమిళనాడులో దశాబ్దాల తరబడి ఆలయ ప్రవేశానికి నోచుకోని కొన్ని కుటుంబాలు ఎట్టకేలకు చారిత్రాత్మకమైన అడుగులు వేయనున్నాయి. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన సుమారు 300 మంది త్వరలోనే ఆలయ ప్రవేశం చేయబోతున్నారు. టెంపుల్‌లో వారు పూజలు చేసుకోవడానికి తిరువన్నమళై జిల్లా అధికారులు మార్గం సుగమం చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ పలుకుబడి, ఆధిపత్యం ఉన్న వర్గాల్లో అసహనం ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే దళితులు ఆలయ ప్రవేశం చేసే సమయంలో పెద్ద మొత్తంలో పోలీసులు అక్కడ మోహరింపులు చేయనున్నారు.

పేరెంట్, టీచర్ మీటింగ్ జరుగుతుండగా ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగారు. తెన్ముదియనూర్ గ్రామంలో సుమారు 500 మంది షెడ్యూల్డ్ కాస్ట్ కుటుంబాలు ఉన్నాయి. అక్కడ 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఉన్నది. 80 ఏళ్లుగా ఆ ఆలయంలోకి దళితుల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్నది. గ్రామంలోని 12 ఆధిపత్య వర్గాలు బలంగా ఈ నిషేధాన్ని సమర్థిస్తున్నారు. వేర్వేరు గుడుల్లో పూజలు చేసుకోవడానికి ఆ కమ్యూనిటీలు దశాబ్దాల క్రితమే అంగీకరించాయని, ఇప్పుడు ఆ సాంప్రదాయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదని ఆధిపత్య వర్గాలు వాదిస్తున్నాయి. 750 మందికి పైగా ఆధిపత్య వర్గాల ప్రజలు ఆలయం వెలుపుల దళితుల ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఆలయాన్ని మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీల్ చేయాలని అంటున్నారు.

Also Read: గర్భం దాల్చేందుకు పూజలు చేస్తానని వివాహితపై సాధువు అత్యాచారం.. గుజరాత్ లో ఘటన

జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్కడి వర్గాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆలయ ప్రవేశాలకు ఎస్సీలకు అనుమతి ఇవ్వాలని ఒప్పించారు. పోలీసుల ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా సాగితే ఎస్సీలు ఆలయ ప్రవేశం పొందుతారు. పొంగల్ ప్రిపేర్ చేసి పూజలు, క్రతవులు చేసుకోవడానికి నోచుకుంటారు.

సుమారు 15 నుంచి 20 ఎస్సీ కుటుంబాలు ఆలయ ప్రవేశానికి ముందుకు వచ్చాయి. ఇదే జరిగితే ఒక కొత్త పరిణామానికి బీజం వేసినట్టు అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఇతర ఎస్సీ కుటుంబాలూ ముందడుగు వేస్తాయని అనుకుంటున్నారు. తద్వారా కమ్యూనల్ డివిజన్ తొలిగిపోతుందని ఆశిస్తున్నారు. 

తమిళనాడు రాష్ట్రంలో ఇది ఇటీవలికాలంలో రెండో ఘటన. పుదుకొట్టయి జిల్లాలోనూ కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి దళితులను ఆలయ ప్రవేశం గావించారు. ఎస్సీ కమ్యూనిటీకి నీటిని సరఫరా చేసే ట్యాంకులో మలాన్ని వేశారనే కథనాలు వెలువడ్డ తర్వాత కలెక్టర్.. దళితులకు ఆలయ ప్రవేశం పై ఫోకస్ పెట్టినట్టు రిపోర్ట్స్ వచ్చాయి.

click me!