
ఢిల్లీ: టెర్రరిజమ్ గురించి చర్చించేందుకు సిద్ధమంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. దేశ సరిహద్దులో జరుగుతున్న ఘటనలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మధ్య సమావేశం జరగాలని కోరుతూ ఇమ్రాన్ లేఖలో పేర్కొన్నారు. ఈ నెల చివరిలో జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ సందర్భంగా ఈ సమావేశం ఉండాలని ఇమ్రాన్ ఖాన్ లేఖలో ప్రస్తావించారు.
ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ తో చేసిన మొదటి అధికారిక ప్రతిపాదన ఇదే కావడం విశేషం. రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక సంబంధాల కోసం భారత్ ఎదురు చూస్తుందని మోదీ ఆగస్టు 20న రాసిన లేఖకు ఇమ్రాన్ సమాధానం ఇచ్చారు.
భారత్ పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలకు కట్టుబడి ఉందని మోదీ అందులో ప్రస్తావించినట్లు అధికారులు వెల్లడించారు. 2015లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హార్ట్ ఆఫ్ ఏషియా సమావేశానికి హాజరైన తరవాత నుంచి రెండు దేశాల మధ్య చెప్పుకోదగ్గ సమావేశాలు ఏమీ జరగలేదు.
ఈనెలాఖరున జరగబోయే యూఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ లోపు సమావేశం జరగాలని కోరారు. రెండు దేశాలు అంగీకరిస్తే యూఎన్ సమావేశంతో సమాంతరంగా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగే అవకాశం ఉంటుందని సమాచారం.