గంగా నదిలో పతకాలు కలపాలనే నిర్ణయంపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ ఏమన్నారంటే?

By Mahesh KFirst Published May 31, 2023, 12:52 PM IST
Highlights

గంగా నదిలో పతకాలు వేయాలన్న నిర్ణయం పూర్తిగా ఆ రెజ్లర్లదే అని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. హరిద్వార్ దాకా వెళ్లి వాటిని నరేశ్ తికాయత్‌కు ఇచ్చారని చెప్పారు. దానికి మనమేం చేయగలం అని పేర్కొన్నారు. తనపై ఆరోపణలను ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
 

లక్నో: నిరసనలు చేస్తున్న రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో కలపడానికి నిన్న హరిద్వార్ చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ రైతు నేతలు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు సర్ది చెప్పడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. కానీ, ఐదు రోజుల డెడ్‌లైన్‌తో ప్రభుత్వానికి అల్టిమేటం పెట్టారు. గంగా నదిలో మెడల్స్ వేయాలనే నిర్ణయంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు.

మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో సహా ఇతర ఆరోపణల కింద బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదయ్యాయి. ఆయనను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించాలని, అరెస్టు చేసి దర్యాప్తు చేయాలని నిరసనలు చేస్తున్న రెజ్లర్లు డిమాండ్ చేశారు.

తాజాగా, ఆరుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం సత్యం ఉన్నా తనను అరెస్టు చేస్తారని వివరించారు. 

నిన్న రెజ్లర్లు తమ పతకాలను గంగలో కలపడానికి పవిత్ర నగరం హరిద్వార్‌కు వెళ్లారు. చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని విరమించుకుని మెడల్స్‌ను రైతు నేత నరేశ్ తికాయత్‌కు అందించారు. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై ఐదు రోజుల్లోగా యాక్షన్ తీసుకోవాలని అల్టిమేటం విధించారు. 

Also Read: గంగా నదిలో పతకాలు వేయడాన్ని విరమించుకున్న రెజ్లర్లు.. ఐదు రోజుల డెడ్‌లైన్‌తో ప్రభుత్వానికి అల్టిమేటం

‘ఈ రోజు వారు మెడల్స్‌ను గంగలో కలపడానికి హరిద్వార్ వెళ్లారు. కానీ, ఆ తర్వాత ఆ పతకాలను నరేశ్ తికాయత్‌కు అందించారు. ఇది వారి వైఖరి, దానికి మనమేం చేయగలం?’ అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.

పతకాలను గంగలో కలపాలనే నిర్ణయం పూర్తిగా ఆ రెజ్లర్లదే అని పేర్కొన్నారు.

హరిద్వార్‌లో గంగా నదిలో తమ పతకాలను వేయడానికి నిన్న రెజ్లర్లు వెళ్లారు. కానీ, అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రైతు నేతలు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇన్నేళ్ల కష్టార్జితం ఆ మెడల్స్ అని, వాటిని గంగపాలు చేయరాదని వారికి చెప్పారు. వీరి జోక్యంతో రెజ్లర్లు పునరాలోచించారు. గంగా నదిలో తమ పతకాలు వేసే నిర్ణయాన్ని విరమించుకున్నారు. వారి మెడల్స్‌ను రైతు నేత నరేశ్ తికాయత్‌కు అప్పజెప్పారు. హర్ కి పౌరి నుంచి వారు వెనుదిరిగారు. 

ఈ నిర్ణయాన్ని విరమించుకుంటూ వారు ప్రభుత్వానికి ఐదు రోజుల డెడ్‌లైన్‌తో అల్టిమేటం విధించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై యాక్షన్ తీసుకోవాలని అల్టిమేటం విధించారు.

ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు తమ పతకాలను గంగా నదిలో వేయడానికి వెళ్లే ప్రకటన చేసిన తర్వాత యూపీ పోలీసులు స్పందించారు. తాము ఆ రెజ్లర్లను ఆపబోమని స్పష్టం చేశారు.

click me!