
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు, పీడీపీ నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేసారు. పాకిస్తాన్ జాతీయులను భారతదేశం నుండి బహిష్కరించడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్ళని తిరిగి పంపించడం అమానుషం అని ఆమె అన్నారు.
“2021 లో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ తల్లి కూడా బహిష్కరణ ప్రక్రియ వల్ల బాధపడ్డారు. అప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ కుటుంబాన్ని సందర్శించారు. మానవతా దృక్పథంతో చూస్తే అన్యాయం జరుగుతుంది,” అని ఆమె అన్నారు. కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది కానీ కొంచెం మానవత్వం చూపాలి అని కూడా అన్నారు.
అయితే 2022 మేలో అమర్‌నాథ్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ కుటుంబాన్ని బహిష్కరణ ప్రక్రియ నుండి మినహాయించినట్లు తెలిసింది. ముదాసిర్ కు 2022 లో శౌర్య చక్ర అవార్డు లభించింది. బారాముల్లాలోని ప్రధాన టౌన్ స్క్వేర్ కు ఆయన పేరు పెట్టారు.
ఇల్తిజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళ దేశానికి పంపిస్తే అమానుషం ఎలా అవుతుంది అని చాలా మంది ప్రశ్నించారు. “పాకిస్తాన్ ముస్లింలకి సురక్షితం కాదా” అని ఒకరు రాశారు. “పాకిస్తాన్ జాతీయులను పాకిస్తాన్‌కు తిరిగి పంపడం అమానుషం - మెహబూబా ముఫ్తీ కుమార్తె అన్నారు. ఇవెక్కడి మాటలు?” అని మరొకరు రాశారు.
భారతదేశంలో ఉన్న ప్రతి పాకిస్తాన్ జాతీయుడినీ మినహాయింపు లేకుండా బహిష్కరించాలని సనా వజీర్ అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు. “పాకిస్తాన్ ప్రయోజనాలకు, విచ్ఛిన్నవాదులకు సేవ చేసిన వంశంలో పుట్టిన ఇల్తిజా ముఫ్తీ ఇప్పుడు మానవత్వం గురించి ప్రసంగిస్తున్నారా? ఆమె కుటుంబం ఉగ్రవాదాన్ని రాజకీయం చేసింది, రాడికల్స్ కి బలం చేకూర్చింది, కాశ్మీర్‌ను మోసం చేసింది. ఆమె కపటత్వాన్ని ఇంక సహించలేం,” అని మరొకరు అన్నారు.