
న్యూఢిల్లీ : ఐఐటీ-ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజాన్ అహ్మద్ (23) మృతదేహాన్ని రెండోసారి శవపరీక్ష కోసం ఈరోజు అస్సాంలో బైటికితీశారు. మొదటి సారి చేసిన శవపరీక్షలో అనేక లొసుగులు ఉన్నాయని.. కోర్టు నియమించిన నిపుణులు ఎత్తిచూపారు. గత నెలలో కలకత్తా హైకోర్టు ఆదేశించినట్లుగా, ఫైజాన్ మృతదేహాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసుల బృందం వెలికితీసి కోల్‌కతాకు తీసుకువెళ్లింది - అక్కడ అతని మృతదేహానిని రెండోసారి శవపరీక్ష నిర్వహిస్తారు.
అస్సాంలోని దిబ్రూగఢ్‌లోని శ్మశాన వాటిక వద్ద ఐఐటీ-ఖరగ్‌పూర్ అధికారులు ఉండటంపై ఫైజాన్ అహ్మద్ తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఐఐటి నుండి కొంతమంది ప్రొఫెసర్లు ఇక్కడికి వచ్చారని మాకు చెప్పారు. వారు ఎందుకు వచ్చారు? వారి ఉద్దేశ్యం ఏమిటో మాకు తెలియదు. వారి ఉనికిపై మాకు అనుమానం ఉంది" అని ఆయన విలేకరులతో అన్నారు.
ముంబయిని త్వరలోనే పేల్చేస్తా: సోషల్ మీడియాలో బెదిరింపు.. నిందితుడు అరెస్టు
నిరుడు అక్టోబర్ 14న క్యాంపస్ ఆవరణలోని హాస్టల్ గదిలో ఫైజాన్ అహ్మద్ శవమై కనిపించాడు. ఇది ఆత్మహత్యేనని కళాశాల అధికారులు చెప్పగా, కుటుంబ సభ్యులు మాత్రం హత్య అని ఆరోపించారు. ర్యాగింగ్ తో అతడిని తీవ్ర మానసిక వేదనకు గురి చేశారని.. అతని ఫిర్యాదులను ఐఐటీ-ఖరగ్‌పూర్ యాజమాన్యం వినలేదని.. ఫైజాన్ అహ్మద్ కుటుంబ సభ్యులు కోర్టుకు తెలిపారు. "ఇది హత్య కేసు అని స్పష్టంగా తెలుస్తుంది" అని వారు చెప్పారు.
ఈ సంఘటనను విచారణ సందర్భంగా ర్యాగింగ్ కేసుగా పరిగణించారు. దీంతో ప్రసిద్ధ విద్యాసంస్థ మీద కలకత్తా హైకోర్టు తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలోనే మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని.. నిజాలను వెలికితీసే క్రమంలో ఇది మరింత కీలకమైనది, అవసరమైనది అని పేర్కొంది. ఈ క్రమంలోనే బాధితుడు ఫైజాన్ అహ్మద్ మృతదేహాన్ని వెలికి తీయాలని ఆదేశించినట్లు జస్టిస్ రాజశేఖర్ మంథా తెలిపారు. బాధితుడి మృతదేహాన్ని అస్సాంలో ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు.
"ఈ వ్యవహారంలో దర్యాప్తు అధికారి అస్సాం పోలీసులతో సమన్వయం చేసుకుంటారు. మృతదేహాన్ని లేదా అవశేషాలను వెలికితీసి, రాష్ట్ర పోలీసులు కోల్‌కతాకు తీసుకువచ్చి, తాజాగా పోస్ట్ మార్టం నిర్వహించేలా చూస్తారు" అన్నారాయన. ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలో ఉన్న ఐఐటీ-ఖరగ్‌పూర్ డైరెక్టర్‌ను హైకోర్టు గతంలో నిలదీసింది. విద్యార్థి మృతికి దారితీసిన ర్యాగింగ్ ఫిర్యాదుపై చర్యలు తీసుకోనందుకు డిసెంబరు 1న కోర్టు అతడిని మందలించింది.