ఐడీ ప్రూఫ్‌లు లేకుండా రూ. 2000 మార్పిడి చేయవద్దు: ఆర్బీఐ, ఎస్బీఐలకు వ్యతిరేకంగా బీజేపీ నేత పిటిషన్

Published : May 22, 2023, 07:50 PM IST
ఐడీ ప్రూఫ్‌లు లేకుండా రూ. 2000 మార్పిడి చేయవద్దు: ఆర్బీఐ, ఎస్బీఐలకు వ్యతిరేకంగా బీజేపీ నేత పిటిషన్

సారాంశం

రూ. 2000 నోట్ల మార్పడికి ఐడీ ప్రూఫ్‌లు, డాక్యుమెంటేషన్‌లను అడగవద్దని ఎస్బీఐ తన గైడ్‌లైన్స్ పేర్కొంది. పెద్ద నోట్లను ఉపసంహరించబోతున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత ఎస్బీఐ ఈ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అయితే, ఐడీ ప్రూఫ్‌లు లేకుండా రూ.2000 నోట్లను మార్పిడి చేయవద్దని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.  

న్యూఢిల్లీ: బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. రూ. 2000 నోట్లను ఎలాంటి ఐడీ ప్రూఫ్‌లు లేకున్నా మార్పిడికి అనుమతించరాదని ఆ పిల్‌లో కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐలకు వ్యతిరేకంగా ఈ పిటిషన్ వేశారు. మే 20వ తేదీన ఎస్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ అహేతుకం, అసంబద్ధం, ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తున్నదని ఆ పిల్‌లో అశ్విని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.

ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రూ. 2000 నోట్ల మార్పడికి తప్పకుండా ఐడీ ప్రూఫ్ వివరాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 2000 నోట్లను మార్పిడి చేయాలనుకునేవారు ఆ నోట్లను వారి ఖాతాలోనే జమ చేసేలా ఆర్బీఐ, ఎస్బీఐ చర్యలు తీసుకోవాలని వివరించారు.

ఇలా చేస్తేనే ప్రభుత్వం బ్లాక్ మనీ పై తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని పిల్‌లో అశ్విని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ఈ విధంగానే ఆదాయానికి మించిన ఆస్తులను సమకూర్చుకున్న వారిపై యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని, పౌరుల ప్రాథమిక హక్కులకు భద్రత ఇవ్వడం కూడా సాధ్యమవుతుందని తెలిపారు.

ఆర్బీఐ శుక్రవారం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చలామణిలో నుంచి క్రమంగా రూ. 2000 నోట్లను వెనక్కి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అయితే, ఆ నోటు చలామణిలో ఉంటుందని, సెప్టెంబర్ 30వ తేదీ వరకు వాటిని బ్యాంకుల్లో, ఆర్బీఐ రీజినల్ బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవాలని తెలిపింది.

Also Read: రూ. 2000 నోట్లు మార్పిడికి ఆధార్, పాన్ కార్డులు అవసరమా?. SBI గైడ్‌లైన్స్‌లో వివరణ

అనంతరం, ఎస్బీఐ తన బ్రాంచులకు ఓ గైడ్ లైన్ విడుదల చేసింది. అందులో ఎలాంటి ఆధారాలు, డాక్యుమెంట్లు లేకుండానే రూ. 2000 నోట్లను మార్పిడి చేసుకోవాలని తెలిపింది. రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి ఆధార్, ప్యాన్ కార్డు వంటి ఐడీ ప్రూఫ్‌లు అడగాల్సిన అవసరం లేదని వివరించింది. 

రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడగానే కొన్ని వర్గాలు బ్లాక్ మనీపై అస్త్రమని వర్ణించగా.. మరికొన్ని రూ. 2000 నోట్లు ప్రవేశపెట్టినా, రద్దు చేసినా బ్లాక్ మనీపై అస్త్రమేనా? అంటూ ప్రశ్నించాయి.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?