చందా కొచ్చర్ లాంగ్ లీవ్ : ఉచ్చు బిగుస్తోందా?

First Published Jun 1, 2018, 1:13 PM IST
Highlights

పుకార్లపై స్పందించిన ఐసీఐసీఐ

చందాకొచ్చర్ ని సెలవు తీసుకోమని తాము అడగలేదని ఐసీఐసీఐ స్పష్టం చేసింది. వీడియోకాన్‌ రుణ ఎగవేత వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌పై ఆ బ్యాంకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు చందాకొచ్చర్ నిరవధికంగా సెలవు తీసుకోవాలని బ్యాంకు సూచించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా.. దీనిపై ఐసీఐసీఐ స్పందించింది.

‘స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేంతవరకు చందాకొచ్చర్‌ సెలవులపై వెళ్లాలని బ్యాంకు అడిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రస్తుతం ఆమె తన వార్షిక సెలవులో ఉన్నారు. ఇది ముందస్తు ప్రణాళికలో భాగమే. అంతేగాక.. చందాకొచ్చర్‌ తర్వాత బ్యాంక్‌ సీఈవోగా ఎంచుకొనే వ్యక్తి కోసం సెర్చ్‌ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు. ఈ వార్తలను బోర్డు తీవ్రంగా ఖండిస్తోంది’ అని ఐసీఐసీఐ వెల్లడించింది.

వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు చేసిన రుణంలో బ్యాంక్ ఎండీ, సీఈవోగా చందా కొచ్చర్ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన నూపవర్ సంస్థలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టారని, దీనికి రుణానికి సంబంధం ఉందని ఓ విజిల్ బ్లోవర్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతీ విదితమే. 
 

click me!