నేను స్వయంగా కశ్మీరీ పండిత్‌.. జమ్ము కశ్మీర్ పర్యటనలో రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

By telugu teamFirst Published Sep 10, 2021, 3:15 PM IST
Highlights

జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ తాను స్వయంగా కశ్మీర్ పండిత్ అని తెలిపారు. తన కుటుంబానికి జమ్ము కశ్మీర్‌తో సుదీర్ఘమైన సంబంధమున్నదని వివరించారు. తన కశ్మీరీ పండిత్ సహోదరుల కోసం ఏమైనా చేస్తానని హామీనిచ్చారు. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్రహోదా వెనక్కి ఇవ్వాల్సిందేనని అన్నారు.
 

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్వయంగా కశ్మీరీ పండిత్ అని, ఇక్కడికి వచ్చాక సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తున్నదని అన్నారు. జమ్ము కశ్మీర్‌తో తన కుటుంబానికి సుదీర్ఘమైన సంబంధాలున్నాయని వివరించారు.

జమ్ములో ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘నేను ఇప్పుడు ఇంటికి చేరుకున్నట్టుగా ఫీల్ అవుతున్నా. జమ్ము కశ్మీర్‌తో నా కుటుంబానికి దీర్ఘమైన సంబంధమున్నది. నేను కశ్మీరీ పండిత్‌ను. నా కుటుంబం కశ్మీర్ పండిత్. ఈ రోజు ఉదయం కశ్మీరీ పండితుల ప్రతినిధుల బృందం నన్ను కలిసింది. వారి కోసం కాంగ్రెస్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. బీజేపీ వారి కోసం చేసిందేమీ లేదు’ అని తెలిపారు.

‘కశ్మీరీ పండితుల కోసం కచ్చితంగా ఏమైనా చేస్తా అని నా సోదరుకుల మాట ఇచ్చాను. నా హృదయంలో జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకమైన చోటు ఉన్నది. కానీ, ఇప్పుడు బాధగా ఉన్నది. జమ్ము కశ్మీర్‌లో సహోదరభావం ఉంటుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు ‘సహోదర’ సంబంధాన్ని తెగ్గొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నది’ అని బీజేపీపై విమర్శలు చేశారు.

ఆయన తన అరచేతిని పైకెత్తి చూపిస్తూ ఇలా మాట్లాడారు.. ‘చేయి అంటే భయపడొద్దని అర్థం. శివుడు, వాహె గురు చిత్రాల్లోనూ చేతిని చూసి ఉంటారు కదా’ అని అన్నారు. ‘మీ రాష్ట్రహోదాను మీ నుంచి లాక్కున్నారు. జమ్ము కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రహోదా రావాలి’ అని ఆశించారు.

గురువారం ఆయన రాహుల్ గాంధీ మాతా వైష్ణో దేవి ఆలయంలో ప్రార్థనలు చేశారు. కాట్రా బేస్ క్యాంప్ నుంచి త్రికూట హిల్స్ గుండా 13 కిలోమీటర్ల యాత్ర చేసుకుంటూ వైష్ణో దేవి ఆలయానికి ఆయన చేరారు. జమ్ములో ఆయనకు ఘనస్వాగతం లభించింది. డోలక్‌లు వాయిస్తూ రాహుల్‌తోపాటు కాంగ్రెస్ టాప్ లీడర్లకు స్థానికులు, నేతలు స్వాగతం పలికారు. ప్రస్తుతం జమ్ములో ఉన్న ఆయన తర్వాత లడాఖ్‌కు వెళ్లనున్నట్టు వివరించారు.

click me!