బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రియాంక ఎవరో తెలుసా?

By telugu teamFirst Published Sep 10, 2021, 2:11 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలో భాగంగా భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా ప్రియాంక తబ్రేవాల్ పోటీచేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. కలకత్తా యూనివర్సిటీలో లా చదివిన ప్రియాంక తబ్రేవాల్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింసపై వాదించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె వాదనతోనే హింసకు సంబంధించిన ఘటనలన్నింటిపై పోలీసు కేసుల నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తబ్రేవాల్ గురించిన వివరాలు చూద్దాం..
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఈ నెలాఖరులో జరగనున్న ఉపఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ నెల 30న బెంగాల్‌లో భవానీపూర్ సహా మూడు స్థానాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థిగా ప్రియాంక తబ్రేవాల్ పోటీ చేయనున్నట్టు కమలం పార్టీ ప్రకటించింది.

ఇప్పటికే తాను మమతా బెనర్జీని ఓడించారని, ఇక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడించాల్సిందే మిగిలుందని విశ్వాసంగా చెబుతున్న బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్ ఎవరో తెలుసా? కోల్‌కతా హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న తబ్రేవాల్ ప్రస్థానాన్ని ఓ సారి చూద్దాం..

కలకత్తా యూనివర్సిటీలో లా చదివిన తబ్రేవాల్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింసపై వాదించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె వాదనతోనే హింసకు సంబంధించిన ఘటనలన్నింటిపై పోలీసు కేసుల నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, బాధితులకు వైద్య చికిత్స, ఉచిత రేషనల్ కల్పించాలని తెలిపింది. అంతేకాదు, ఈ హింస కేసులపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఆదేశించడంలో ఆమె వాదన పటిమలున్నాయి.

థాయిలాండ్‌లోని అజంప్షన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టాలు పొందిన ఆమె నరేంద్ర మోడీ నాయకత్వంతో ఆకర్షితురాలై 2014లో బీజేపీలో చేరారు. బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియోకు లీగల్ అడ్వైజర్‌గా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ యూత్ వింగ్ యువ మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

చివరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటెల్లీ సీటు నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన ఆమె టీఎంసీ అభ్యర్థి స్వర్ణ కమల్ సాహాపై 58వేల పైచిలుకు ఓట్లతో పరాజయం పాలయ్యారు.

‘సీఎం మమతా బెనర్జీని నేను హైకోర్టులో తొలిసారిగా ఓడించాను. రాష్ట్రంలో అసలు హింసే లేదని ఆమె వాదించారు. కానీ, నేను హింస ఉన్నట్టు నిరూపించాను. కోర్టు ఆదేశాలే దీన్ని నిరూపిస్తున్నాయి’ అని ప్రియాంక తబ్రేవాల్ అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి సువేందు అధికారిపై 1,956 ఓట్లతో సువేందు అధికారిపై దీదీ ఓటమిపాలయ్యారు. ఈ ఫలితాలను సవాల్ చేస్తూ ఆమె కోర్టుకెక్కారు. అనంతరం సీఎంగా బాధ్యతలు తీసుకున్న ఆమె ఆరు నెలల్లోపు శాసన సభ సభ్యురాలు కావాల్సి ఉన్నది. లేదంటే ఆమె సీఎం పదవి కోల్పోతారు. కాబట్టి భవానీ పూర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. భవానీ పూర్ నుంచి చివరి రెండుసార్లు గెలిచి ఆమె సీఎం పీఠాన్ని అధిరోహించారు.

click me!