ఆత్మనిర్భర్ భారత్: రెండు దశాబ్దాల్లో 350 యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తామన్న ఐఏఎఫ్ చీఫ్

By telugu teamFirst Published Sep 8, 2021, 3:08 PM IST
Highlights

భారత వైమానిక దళం వచ్చే 20ఏళ్లలో 350 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా వెల్లడించారు. ఈ విమానాలను స్వదేశీ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ నేటి పరిస్థితులకు అవసరమైన వ్యూహమని వివరించారు.
 

న్యూఢిల్లీ: చైనా నుంచి ముప్పు పెరుగుతున్న తరుణంలో భారత వైమానిక దళం అమ్ములపొదిని అధునాతన సాంకేతికతో నింపుకోవాలని చూస్తున్నది. రెండు దశాబ్దాల్లో సుమారు 350 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తామని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా వెల్లడించారు. అంతేకాదు, వీటి కూడా భారత దేశ మార్కెట్‌ నుంచే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. సెక్యూరిటీ కోసమూ దేశీయంగా వీటిని కొనుగోలు చేయడం అవసరమని వివరించారు. ‘ఎనర్జైజింగ్ ఇండియన్ ఎరోస్పేస్ ఇండస్ట్రీ: చాలెంజెస్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్’ పేరిట నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

‘ఉత్తరాదిన పొరుగుదేశాల నుంచి ఉన్న ముప్పు నేపథ్యంలో భారత్ స్వయంగా అధునాతన సాంకేతికతను కలిగి ఉండటం అవసరం. స్వయంగా సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడంతో వచ్చే అవాంఛనీయ ఘటనల్లో మెరుపుదాడులకు అవకాశం ఉంటుంది’ అని భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా వివరించారు. నేడు ఆత్మనిర్బర్ భారత్ వ్యూహం అవసరమని తెలిపారు. దీనికి ప్రత్యేకంగా నిధులు అవసరం పడుతాయని, దీర్ఘకాలం కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. కానీ, ఫలితాలు అదే స్థాయిలో ఉంటాయని తెలిపారు.

83 ఎల్‌సీఏ తేజస్ విమానాలు సహా వచ్చే 20ఏళ్లలో 350 ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించామని బదౌరియా చెప్పారు. ఇప్పటికే 83 ఎల్‌సీఏ తేజస్ విమానాల తయారీకి కేంద్ర ప్రభుత్వం హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్‌కు కాంట్రాక్టు ఇచ్చిందన్నారు. ఫిబ్రవరిలో ఇచ్చిన ఈ కాంట్రాక్టు విలువ సుమారు రూ. 48వేల కోట్లు అని తెలిపారు. దీనికంటే ముందు 40 తేజస్ విమానాలకు కేంద్రం ఆర్డర్ ఇచ్చిందని, ఇందులో సగం మేరకు ఇప్పటికే వైమానిక దళానికి చేరాయని చెప్పారు. ఐదో జెనరేషన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల అభివృద్ధి పురోగతి సాధిస్తున్నదని, 2025కల్లా దాని తొలి రూపు అందుబాటులోకి వస్తుందని వివరించారు.

click me!