కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం.. ఎన్‌డీఏలోకి మహిళలకు అనుమతి.. శాశ్వత కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్

By telugu teamFirst Published Sep 8, 2021, 2:01 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళకూ ప్రవేశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. తద్వార వారికి త్రివిధ దళాల్లో శాశ్వత కమిషన్ కల్పించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వారిని నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో ప్రవేశానికి అనుమతించింది. తద్వారా త్రివిధ దళాల్లో వారికి శాశ్వత కమిషన్‌కు అవకాశం కల్పించింది. మహిళ సిబ్బందికీ సైన్యంలో శాశ్వత కమిషన్ ఇవ్వాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతున్నది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం అటువైపుగా నిర్ణయం తీసుకున్నట్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాతి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎన్‌డీఏ కోర్సులకు మహిళలకు ప్రవేశం కల్పించడానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉన్నదని, ఇందుకు సమయమివ్వాలని కోరారు. దీనికి సమ్మతించిన సుప్రీంకోర్టు ఈ నెల 20లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

ఎన్‌డీఏలోకి మహిళలకు అనుమతించాలని స్వయంగా భద్రతా బలగాల బాధ్యులే నిర్ణయం తీసుకోవడం హర్షిందగ్గ విషయమని జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎంఎం సుంద్రేశ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. భద్రతా బలగా పాత్ర కీలకమైందని, కానీ, అందులో లింగ సమానత్వం కోసం పోరాటం జరగాల్సి ఉన్నదని తెలిపింది.

ఎన్‌డీఏ అడ్మిషన్ పరీక్షలకు మహిళలూ హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు ఇటీవలే కీలక ఆదేశాలు వెలువరించింది. ఈ పరీక్షలు నవంబర్ 14వ తేదీకి రీషెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. భద్రతా బలగాల్లో పురుషులతో మహిళలకూ సమాన అవకాశాలు ఇవ్వకపోవడం శోచనీయమని, అది మైండ్ సెట్ సమస్య అని గతనెల 18న కేంద్రాన్ని సుప్రీంకోర్టు విమర్శించింది. అంతేకాదు, ‘మీరు కచ్చితంగా మారాలి’ అని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కేంద్రం మహిళలను తాత్కాలిక కమిషన్ ప్రాతిపదికన నియమాకం చేసుకుంటున్నది. తర్వాత పురుషులకు శాశ్వత కమిషన్ కల్పిస్తున్నట్టు మహిళలకు కల్పించడం లేదు.

click me!