Omar Abdullah: భావసారూప్యత గల పార్టీలన్నీ ఒక తాటి మీదికి రావాలి: ఒమర్ అబ్దుల్లా

Published : Mar 01, 2022, 02:55 AM IST
Omar Abdullah: భావసారూప్యత గల పార్టీలన్నీ ఒక తాటి మీదికి రావాలి: ఒమర్ అబ్దుల్లా

సారాంశం

Omar Abdullah: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆత్మకథా  ‘ఉంగలిల్ ఒరువన్’ (మీలో ఒకరు) పుస్తకాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భిన్నత్వం కారణంగా భారతదేశం ఏకీకృతమైన దేశమ‌నీ, ఆ ఆలోచనను విశ్వసించే భావసారూప్యత గల పార్టీలన్నీ ఒకే తాటిమీదికి రావాల‌ని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.   

Omar Abdullah: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆత్మకథా  ‘ఉంగలిల్ ఒరువన్’ (మీలో ఒకరు) పుస్తకాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. తొలి పుస్తకాన్ని తమిళనాడు మంత్రి దురైముగురన్‌కు రాహుల్ గాంధీ అందజేశారు.

ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. "నేను ఇక్కడికి బాధితుడిగానే కాదు.. ఏమి జరుగుతుందో ముంద‌స్తు హెచ్చరికగా వ‌చ్చాను " అని అన్నారు. ఆపద సమయంలో మాత్రమే మిత్రులు ఎవరో తెలుస్తుందని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం అన్నారు.

తాను కష్టాల్లో ఉన్న‌ప్పుడూ.. స‌హ‌క‌రించడానికి ఎవ‌రూ ముందుకు రాలేద‌నీ,  చాలా మంది వ్యక్తులు మౌనంగా ఉన్నార‌నీ, కానీ స్టాలిన్ మాత్రం అండ‌గా నిలిచార‌ని, అందుకే తాను ఇక్కడికి వ‌చ్చాన‌ని ఒమర్ అబ్దుల్లా అన్నారు. స్టాలిన్ పార్టీ చిన్న‌దేనైనా.. బీజేపేత‌ర పార్టీల‌కు మ‌ద్ద‌తు ఉంటుంద‌నీ, స్టాలిన్ వారితో క‌లిసి న‌డుస్తాడ‌నీ అన్నారు. అలాగే.. పుస్తకావిష్కరణ వేదికపై నాయకులంతా కలువ‌న‌ప్ప‌టికీ..  ఈ కార్యక్రమం 'లైక్ మైండెడ్' నాయకుల మధ్య ముందస్తు కూటమి సమావేశానికి మూడ్ సెట్ చేసిందని అన్నారు. 

ఆర్టికల్ 370 రద్దు వంటి చర్యలకు వ్యతిరేకంగా బిజెపిని ఎదుర్కోవడానికి,  పోరాటం కొనసాగించడానికి భావసారూప్యత గల లౌకిక పార్టీలు క‌లిసి ముందుకు రావాలిని ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌పై కేంద్రం వ్యవహరిస్తున్నతీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తమిళనాడుకు అవసరం ఏర్పడితే.. తాము వెన్నుదన్నుగా నిలుస్తామ‌ని అబ్దుల్లా అన్నారు. దేశం నేడు కీలకమైన దశలో నిలిచిందని,  మనం దేని కోసం నిలబడుతున్నాం అనే ఆలోచనలో ప‌డింద‌ని అన్నారు. తిలకం, తలపాగా, బురఖా లేదా హిజాబ్ వంటి మతపరమైన చిహ్నాలను ఎంచుకునే హక్కు, మతపరమైన విషయాల్లో స్వేచ్ఛ ఉంద‌నీ, కానీ కొన్ని కారణాల వల్ల నిరాకరించబడింద‌ని అన్నారు. 

 ఆ స్వేచ్చ కోల్పోతే.. భారతదేశ రాజ్యాంగంలో పొందుపరచబడిన సమాఖ్య అనే భావ‌న ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోందనీ,  బీజేపీ ప‌రిపాల‌న‌లో రాష్ట్రాల అధికారాలపై నిరంతరం దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రం ఆలోచన సఫలమైతే.. స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లు పోలీస్‌ చీఫ్ లేదా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోతార‌ని అన్నారు.  అబ్దుల్లా నేడు తమిళనాడుకు కేవలం 'బాధితుడు'గా మాత్రమే ఉన్నారని, దేశంలోని ఇతర ప్రాంతాలలో భవిష్యత్తులో ఏమి జరుగుతుందో గురించి జాగ్రత్త వహించాలని అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల అనుమతి లేకుండానే కేంద్రం రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారని అన్నారు.

కానీ, ఆ ప్ర‌క్రియ.. జమ్మూకశ్మీర్ ప్రజల అనుమతి లేకుండా జరిగిందనీ, మార్పులు చేయడానికి అసెంబ్లీ మాత్రమే కాకుండా రాజ్యాంగ పరిషత్ అధికారాలను గవర్నర్ తీసుకున్నారని అన్నారు. భిన్నత్వం కారణంగా భారతదేశం ఏకీకృతమైన దేశమ‌నీ, ఆ ఆలోచనను విశ్వసించే భావసారూప్యత గల పార్టీలన్నీ ఒకే తాటిమీదికి రావాల‌ని అబ్దుల్లా పిలుపునిచ్చారు. 

అనంత‌రం.. ఈ కార్యక్రమంలో తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. వివిధ వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తూ సామాజిక, ఆర్థిక న్యాయంలో తమిళనాడు అగ్రగామిగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. మలయాళీలు, తమిళులు ఒకే నేల బిడ్డలని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు స్టాలిన్ ప్రయత్నించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తాను, స్టాలిన్  ఎలా చిత్రహింసలకు గురయ్యామో పినరయి విజయన్‌ గుర్తు చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధానంగా బీజేపీ వ్య‌తిరేక పార్టీల నేత‌లంద‌రూ క‌ల‌వ‌డానికి వేదిక అవుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే త‌దిత‌రులు హాజ‌రు కాలేదు. 

PREV
click me!

Recommended Stories

Moon Earth : థర్డ్ వరల్డ్ వార్ కాదు.. అంతకంటే పెద్ద ముప్పు భూమికి రాబోతోంది
PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu