
కాన్పూర్ : ఓ మహిళ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా.. ఆమె భర్త దాన్ని మొత్తం వీడియో తీశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన అత్యంత హేయమైన చర్య కాన్పూర్ లో చోటు చేసుకుంది. శోబితా గుప్తా అనే మహిళ ఉరి వేసుకోవడానికి ప్రయత్నించింది. మొదటిసారి ఆ ప్రయత్నంలో విఫలం అయ్యింది. తరువాత పదే పదే ప్రయత్నించి.. చివరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దీన్ని మొత్తం చూస్తున్న భర్త సంజీవ్ ఆపలేదు, రక్షించలేదు సరికదా.. అదంతా వీడియోలో రికార్డ్ చేశాడు. ఆమె చనిపోయిన తరువాత శోభిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దీంతో షాక్ కు గురైన ఆమె తల్లిదండ్రులు వెంటనే హుటాహుటిన కూతురి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆమె మృతదేహం మంచంపై పడి ఉండడాన్ని గుర్తించారు.
"మేము ఇంటికి చేరుకున్నప్పుడు, మా కుమార్తె మృతదేహం మంచం మీద పడి ఉంది. సంజీవ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులుగా ఆమెను అటూ, ఇటూ తిప్పుతున్నాడు. మేము వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాం, అక్కడ ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అప్పుడు సంజీవ్ మాకు వీడియో చూపించాడు. ఆమె ఇంతకు ముందు కూడా ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిందని అతను చెప్పాడు" అని శోభిత తండ్రి రాజ్‌కిషోర్ చెప్పారు. పోలీసులు శోబిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. వీడియోతో సహా మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ అనూప్ సింగ్ తెలిపారు.
సినీ నిర్మాతపై భార్య ఛీటింగ్ కేసు.. మరో మహిళతో ఉండడం చూసి, కారుతో గుద్ది...
భర్తతో విభేదాలు రావడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని, సమాచారం అందిన వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు పంపారని, భర్తను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మృతురాలి బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఏసీపీ సింగ్ తెలిపారు.
ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇలాంటి ఘటనే జరిగింది. భర్త ఎదుటే ఉరివేసుకుని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సింది పోయి వీడియో తీశాడు ఆ భర్త. ఆ తరువాత ఈ వీడియో వైరల్ కావడంతో... విషయం తెలుసుకున్న పోలీసులు భర్త పెంచలయ్యను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెంచలయ్యను అరెస్టు చేశారు. మృతురాలిని ఆత్మకూరు మెప్మా లో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న కొండమ్మగా గుర్తించారు. అటు పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మెప్మా సిబ్బంది ఆందోళనకు దిగారు.
కాగా, పెంచలయ్య ఈ జనవరిలో భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాప్రయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఇదంతా సెల్ఫీ తీసుకుని, వాట్సాప్ లో షేర్ చేయడంతో సంచలనంగా మారింది. పెంచలయ్య ఆత్మకూరులోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. భర్త వేధింపులు భరించలేక భార్య కొండమ్మ నిరుడు సెప్టెంబర్ 21న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో భార్య సమాధి వద్దకు వెళ్లిన పెంచలయ్య.. తన భార్య చావుకు, తన చావుకు ఆరుగురు కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం గమనార్హం. ఇదే విషయాలను చెబుతూ సెల్ఫీ వీడియో తీసి వాట్స్అప్ గ్రూపులో షేర్ చేశాడు.
ఆ తర్వాత పురుగుల మందు తాగడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ వీడియో చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని వైద్యం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం నెల్లూరుకు తరలించారు.