
ముంబయి: మహారాష్ట్రలోని ఓ మూసేసిన షాపులో మనిషి మెదడు, కళ్లు, చెవులు, ఇతర మనిషి భాగాలు లభించాయి. నాసిక్ నగరంలోని ఓ బిల్డింగ్ బేస్‌మెంట్ షాపులో ఇవి వెలుగులోకి వచ్చాయి. గత రెండు మూడు రోజులుగా మూసేసిన ఆ షాపు నుంచి దుర్వాసన వెదజల్లుతున్నది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే షాపు తెరిచి పరిశీలించారు.
ఆ షాపు నిండా మొత్తం చెడిపోయిన సమాన్లు ఉన్నాయని పోలీసులు వివరించారు. కానీ, రెండు ప్లాస్టిక్ కంటైనర్లు అనుమానాస్పదంగా కనిపించాయని తెలిపారు. వాటిని విప్పి చూడగా, అందులో మనిషి కళ్లు, మెదడు, చెవులు, ఇతర ముఖ భాగాలు కనిపించాయని పేర్కొన్నారు. దీనిపై వెంటనే ఫోరెన్సిక్ టీమ్‌కు సమాచారం ఇచ్చామని, వారు ఆ మనిషి భాగాలను కస్టడీలోకి తీసుకున్నట్టు ముంబయి నాకా పోలీసు స్టేషన్ అధికారులు తెలిపారు.
ఆ షాపు యజమాని ఇద్దరు కుమారులు వైద్యులేనని పోలీసులు చెప్పారు. కాబట్టి, ఆ వైద్యులు మెడికల్ పర్పస్‌లోనూ ఈ భాగాలను భద్రపరుచుకుని ఉండొచ్చని అన్నారు. ఏదైనప్పటికీ.. తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్టు వివరించారు.
నాసిక్‌లోని ఈ భాగాలు లభించిన షాప్ సుమారు 15 రోజులుగా మూసే ఉన్నది. అందులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులను అనుమానాలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కానీ, ఇది మర్డర్ కేసుగా వారు భావించడం లేదని తెలుస్తున్నది. ఆ షాపు యజమాని ఇద్దరు కుమారులూ వైద్యులు కావడం, మెడికల్ పర్పస్‌లో వాటిని భద్రపరిచి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అంతేకాదు, ఆ విడి భాగాలు కెమికల్స్ ముంచి భద్రపరిచినట్టుగానే లభించాయని వివరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కానీ, ఇప్పటి వరకైతే ఎలాంటి కేసూ నమోదు చేయలేదని అన్నారు.
కాగా, ఈ ఘటనపై ఓ మీడియా సంస్థతో పోలీసు కమిషనర్ పౌర్ణిమా చౌగులే మాట్లాడారు. ఒక దగ్గర శవం ఉన్నట్తు తెలిస్తే.. అక్కడ హత్య జరిగినట్టుగా భావిస్తామని తెలిపారు. కానీ, ఇక్కడ ఎనిమిది చెవులు సరైన రీతిలో కట్ చేసి ఉన్నాయని వివరించారు. ఆ పని ప్రత్యేకంగా స్పషలిస్టులు చేసినట్టుగానే ఉన్నదని తెలిపారు. లేదా ఆ రంగంలో నైపుణ్యం ఉన్నవారు.. రోజూ అదే పని చేసే వారు చెవులను కట్ చేసినట్టు ఉన్నదని చెప్పారు.
కాగా, షాపు యజమాని మాత్రం మానవ భాగాల గురించి తనకు తెలియదని స్పందించినట్టు సమాచారం. వాటి గురించి తనకు ఏమీ తెలియదని పేర్కొన్నారని స్థానికంగా కథనాలు వచ్చాయి.
ఇదిలా ఉండగా, ఈ నెలలోనే త్రిపురలోని ఓ మహిళ అందరూ పడుకుని ఉండగా తనను కట్టుకున్న భర్త తల నరికేసింది. కొడుకు లేచి గగ్గోలు పెట్టగానే తలను ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి దేవుడి గుడిలో పెట్టింది. ఆ తర్వాత మరో రూములోకి వెళ్లి డోర్ వేసుకుంది. ఖొవాయ్ జిల్లా ఇందిరా కాలనీ గ్రామంలో రబీంద్ర తంతి, ఆమె భార్య కలిసి జీవిస్తున్నారు. బీరంద్ర తంత్రి దినసరి కూలీ. వారికి ఇద్దరు మైనర్ కుమారులు ఉన్నారు. రాత్రి 50 ఏళ్ల రబీంద్ర తంత్రిని 42 ఏళ్ల భార్య హతమార్చింది. తల నరికేసింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేవని ఖొవాయ్ ఎస్పీ భానపద చక్రబొర్తి తెలిపారు.