రాఫెల్ డీల్‌... కేంద్రాన్ని నిర్ణయాల వివరాలు చెప్పమన్న సుప్రీం

By sivanagaprasad kodatiFirst Published Oct 10, 2018, 12:48 PM IST
Highlights

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్రప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం కీలక టర్న్ తీసుకుంది... భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంపై అసలు నిజాలు రాబట్టాలంటూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్రప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం కీలక టర్న్ తీసుకుంది... భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంపై అసలు నిజాలు రాబట్టాలంటూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

దీనిపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రప్రభుత్వం తరపున అడ్వోకేట్ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. దేశ రక్షణకు సంబంధించిన విషయాలను బయటపెట్టలేమని వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు..

పిటిషన్‌లో రాజకీయ పరమైన ఉద్దేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. రాఫెల్ ఒప్పందం దేశ రక్షణకు సంబంధించిన అంశం కాబట్టి ఖర్చుల వివరాలు అడగమని.. కానీ ఒప్పందం నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకున్నారో వెల్లడించాలంటూ న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది.

‘‘ మేము ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయం.. పిటిషనర్ చేసిన వాదనలో జోక్యం చేసుకోం.. కానీ వారి వాదనలు పూర్తిగా ఆమోదయోగ్యం కానివి’’ అని సుప్రీం పేర్కొంది.. అయితే ఈ ఒప్పందంలో నిర్ణయాధికారం తీసుకున్న అంశాలపై మమ్మల్ని సంతృప్తి పరచాలని కోరుకుంటున్నామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ కంపెనీతో 59 వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది.. 2016లో ప్రధాని నరేంద్రమోడీ.. నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండేలు ఈ ఒప్పందాన్ని ప్రకటించారు.

అయితే ఇందుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో ఇవ్వాల్సిందిగా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని ఎంఎల్ శర్మ.. రాఫెల్ ఒప్పందంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరపాలని ఆప్ ఎంపీ ఒకరు విడివిడిగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. 

click me!