UP Assembly Elections 2022: వారణాసిలో ఎన్నికల వాతావరణం ఎలా ఉంది?.. పీఎం మోడీ ప్రశ్నకు కార్యకర్తల సమాధానం ఇదే

By Mahesh KFirst Published Jan 18, 2022, 2:41 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇదే సందర్భంలో ప్రధాని మోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని బీజేపీ వర్కర్లతో మంగళవారం వర్చువల్‌గా సంభాషణలు జరిపారు. ఇందులో అక్కడి వాతావరణం గురించి పలు ప్రశ్నలు వేసి కార్యకర్తల నుంచి సమాధానాలు తీసుకున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ వచ్చిన తర్వాత మార్పులు ఏం వచ్చాయని అడిగారు. విద్యుత్ సరఫరా ఎలా ఉన్నదని ప్రశ్నించారు. వారణాసి నగరంలో ప్రస్తుత ఎన్నికల వాతావరణం ఎలా ఉన్నదని అడిగారు. వీటికి బీజేపీ వర్కర్లు సమాధానాలు చెప్పారు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Uttar Pradesh Assembly Elections)పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. బీజేపీ(BJP) మళ్లీ అధికారాన్ని కచ్చితంగా తమ వద్దే ఉంచుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. కరోనా కేసుల కారణంగా ప్రత్యక్ష ర్యాలీలకు ఎన్నికల సంఘం నో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీ వరకు ప్రత్యక్ష ర్యాలీలపై నిషేధం విధించింది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వర్చువల్ ర్యాలీ(Virtual Rallies)లపై ఆధారపడ్డాయి. ఇలాంటి ఓ వర్చువల్ ర్యాలీలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి చెందిన బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు. దేశంలోనే అతి పురాతన నగరం, యూపీకి చెందిన వారణాసి(Varanasi) నుంచే ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటుకు ఎన్నికైన తెలిసిందే.

వారణాసికి చెందిన బీజేపీ వర్కర్లతో ఆయన మంగళవారం వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ విస్తరణ, కార్యకర్తల ఎదుగుదల గురించి మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి పని చేయాలని కోరారు. ఈ సందర్భంగానే ఆయన కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ వచ్చిన తర్వాత ఏం మార్పులు వచ్చాయి? అని అడిగారు. ఒక పార్టీ వర్కర్ శ్రవణ్ రావత్ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇక్కడ టీ అమ్మకాలు, పూవులు అమ్మకాలు పెరిగాయని తెలిపారు. హోటల్ బుకింగ్‌లు పెరిగాయని, పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పుడు దేవుడి దర్శనానికి వస్తున్నారని వివరించారు.

ఆ తర్వాత ప్రధాని మోడీ బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సీమా దేవితో మాట్లాడారు. మహిళా స్వచ్ఛంద గ్రూపులు, బ్యాంకింగ్ సేవల ద్వారా ఎక్కువ మంది మహిళలను తమతో అనుసంధానంలో ఉంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్ సేవలు నిరంతరాయంగా ఉన్నాయా? లేవా? అని అడిగారు. దానికి బీజేపీ వర్కర్ అశోక్ దూబే స్పందిస్తూ రెగ్యులర్‌గా విద్యుత్ సేవలు అందుబాటులో ఉంటున్నాయని సమాధానం ఇచ్చారు.

వారణాసిలో ఎన్నికల వాతావరణం ఎలా ఉన్నదని అడిగారు. దీనికి ఒకరికి మించి వర్కర్లు స్పందించారు. పురాతన నగరమైన వారణాసి ప్రజలు.. ప్రధాని మోడీతో సంతృప్తిగా ఉన్నారని వివరించారు. యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పట్లా ప్రజలు సంతోషంగానే ఉన్నారని తెలిపారు.

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యానాథ్‌(CM Yogi Adityanath)ను గోరఖ్‌పూర్(Gorakhpur) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనున్నట్టు బీజేపీ (BJP) ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత అయోధ్య నుంచి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగినా.. అధికారిక ప్రకటన మాత్రం భిన్నంగా వచ్చింది. యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్ నుంచే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అది ఆయన స్వస్థలం కూడా. కాబట్టి.. అక్కడే ఎక్కువ పట్టు ఉండే అవకాశం ఉన్నదని, బీజేపీ ఆయనకు గోరఖ్‌పూర్ నుంచే టికెట్ ఇచ్చింది. ఈ కారణంగానే గోరఖ్‌పూర్ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ రాధా మోహన్ అగర్వాల్‌కు టికెట్ నిరాకరించింది. పార్టీ టికెట్ కోల్పోవడంతో ఆ ఎమ్మెల్యే రుసరుస లాడుతున్నాడు. ఈ అవకాశాన్ని సమాజ్‌వాదీ పార్టీ(SP).. యోగిపై అస్త్రంగా మార్చుకోవాలని భావించింది. బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ రాధా మోహన్ అగర్వాల్‌కు తమ పార్టీ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆఫర్ ఇచ్చారు.

click me!