PFI: వామ్మో.. పీఎఫ్‌ఐ ఇంత డేంజరా.? SDPI అధ్యక్షుడి అరెస్ట్‌తో తెరపైకి సంచలన విషయాలు..

Published : Mar 06, 2025, 02:27 PM IST
PFI: వామ్మో.. పీఎఫ్‌ఐ ఇంత డేంజరా.? SDPI అధ్యక్షుడి అరెస్ట్‌తో తెరపైకి సంచలన విషయాలు..

సారాంశం

సోషల్‌ డొమోక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీ అరెస్ట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నిషేధిత పీఎఫ్‌ఐతో ఎస్‌డీపీఐ పార్టీకి సంబంధం ఉన్న బ్లాక్‌ మనీ కేసులో ఎస్‌డీపీఐ అధ్యక్షుడిని అరెస్ట్‌ చేశారు. దీంతో అసలు ఏంటీ పీఎఎఫ్‌ఐ అనే ప్రశ్న తెరపైకి వచ్చింది..   

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక లావాదేవీల ఆరోపణలతో ఎన్‌డిపిఐ జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సోమవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా విచారణ కోసం ఆరు రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. గురువారం ఈడీ విచారణ చేపట్టింది. పీఎఫైతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఈడీ అధికారులు ఫైజీని విచారిస్తున్నారు. 

విచారణలో భాగంగా విదేశాల నుంచి పిఎఫ్ఐకి వచ్చిన డబ్బు గురించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. SDPI పార్టీ ఆర్థిక లావాదేవీలను పీఎఫ్‌ఐ నియంత్రించిందని ఈడీ భావిస్తోంది. ఎస్డీపిఐ కోసం ఎన్నికల నిధిని పాపులర్ ఫ్రంట్ నుండి ఇస్తున్నట్లు ఈడీ తేల్చింది. వీళ్ళు లోపల ఇస్లామిక్ కార్యకలాపాలు చేపడుతూ బయటకు సామాజిక ఉద్యమంగా పనిచేస్తున్నారని ఈడి తెలిపింది. తనిఖీల్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు పిఎఫ్ఐ ఈ ఎస్డీపిఐకి ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు ఈడి తెలిపింది. గల్ఫ్ నుండి కూడా చట్టవిరుద్ధంగా డబ్బు వచ్చిందని... దేశంలో దాడులు, ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి రంజాన్ కలెక్షన్ పేరుతో డబ్బు వసూలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అంటే ఏంటన్న చర్చ తెరపైకి వచ్చింది. ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిషేధం విధించి.? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐదేళ్ల పాటు నిషేధం: 

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) ఒక ఇస్లామిక్‌ అతివాద సంస్థ. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ సంస్థకు చెందిన చాలా మంది హింస, నేరాలు, ఉగ్రవాదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2022లో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి భారీ ఆపరేషన్‌ చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 250 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులు, కార్యకర్తలను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాల్లో పీఎఫ్‌ఐ సంస్థ దేశ వ్యతిరేక చర్యలు చేపడుతున్నట్లు తేలడంతో ఈ సంస్థపై కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ సంస్థపై కేంద్రం ఐదేళ్లు నిషేధం విదిస్తూ నిర్ణయం తీసుకుంది. 

అసలేంటీ సంస్థ.? ఏం చేస్తుంది.? 

ఇస్లామిక్‌ అతివాద సంస్థల్లో ఒకటైన పీఎఫ్‌ఐ రెండు వర్గాల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ తమ సభ్యులకు శిక్షణ ఇస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ సభ్యులు, దాని అనుబంధ సంస్థలపై 1300కిపైగా క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. కేరళలో కొంత మంది పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థలో చేరి సిరియా, ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ వంటి దేశాల్లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయి. అదే విధంగా పీఎఫ్‌ఐకి జమాత్‌ ఉల్ ముజాహిదీన్‌తోనూ సంబంధలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

గతంలో కేరళలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్య కేసులో, తమిళనాడులో హిందూనేత హత్య కేసులో పీఎఫ్‌ఐ కార్యకర్తలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక మంది హిందూ మద్దతుదారులను ఈ సంస్థ సభ్యులు హత్య చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న పీఎఫ్‌ఐ సభ్యుల నుంచి అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ శిక్షణ వీడియోలు అప్పట్లో లభ్యమయ్యాయి. 2021లో కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ అటవీ ప్రాంతంలో పోలసులు పేలుడు పదార్థాలు, జిహాదీ సాహిత్యాన్ని గుర్తించారు. ఈ అటవీ ప్రాంతాన్ని పీఎఫ్‌ఐ మిలిటరీ శిక్షణ కేంద్రంగా ఉపయోగిస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

నైపుణ్యాల శిక్షణ ముసుగులో మిలిటరీ శిక్షణ: 

పీఎఫ్‌ఐ సంస్థ యువతకు నైపుణ్యాల శిక్షణ ముసుగులో మిలటరీ తరహా శిక్షణ ఇస్తుందన్న ఆరోపణనలు కూడా ఉన్నాయి. యువతలో ఒక వర్గానికి వ్యతిరేకంగా ద్వేష భావాన్ని నింపుతూ దాడులకు ఉసగొల్పుతుందని దర్యాప్తులో తేలింది. 2013లో ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌ జిల్లాలో గల పీఎఫ్‌ఐ శిక్షణ శిబిరంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. అప్పట్లో దానిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టగా 41 మంది పీఎఫ్‌ఐ సభ్యులను కోర్టు దోషులుగా తేల్చింది. 

నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.? 

సామాజిక సంస్థగా చెప్పుకునే పీఎఫ్‌ఐ కార్యకలాపా కోసం దేశ విదేశాల నుంచి నిధులు లభిస్తున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. ఈ సంస్థకు చెందిన 100కు పైగా బ్యాంకు ఖాతాలు.. ఖాతాదారుల ఆర్థిక వివరాలతో సరిపోలట్లేదని అప్పట్లో అధికారులు గుర్తించారు. ఈ సంస్థకు చెందిన సభ్యుల ఇళ్లల్లో పలుసార్లు చేపట్టిన సోదాల్లో బాంబు తయారీ పత్రాలు, ఐసిస్‌ వీడియోలను అధికారులు గుర్తించారు. భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్థ కుట్ర పన్నినట్లు  అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. 

తెలుగు రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు. 

2021లో తెలంగాణలోని బైంసాలో జరిగిన అల్లర్ల వెనకాల కూడా పీఎఫ్‌ఐ సంస్థ హస్తం ఉందన్న వార్తలు వచ్చాయి. ఈ అల్లర్లు జరిగిన తర్వాత నలభైకి పైగా బృందాలు నిజామాబాద్, కడప, కర్నూలు, గుంటూరు, నిర్మల్, నెల్లూరు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పీఎఫ్ఐ నేతలు ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారన్న అనుమానంతో దాడులు చేపట్టినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో ఎన్‌ఐఏ బృందం సోదాలు నిర్వహించింది. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !